ఫేస్బుక్ పరిచయం బంగారు నగల చోరీకి దారితీసింది. ఏపీ కృష్ణా జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామంలో జరిగిన ఈ చోరీని పోలీసులు చాకచక్యంతో ఛేదించారు. నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన వసంత శ్రీ, ఆమె భర్తకు ఫేస్బుక్లో ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన కర్నాటి ప్రవీణ్ పరిచయం అయ్యాడు. ఫేస్బుక్ పరిచయంతో కర్నాటి ప్రవీణ్ వసంతశ్రీ ఇంటికి అప్పుడప్పుడు వస్తుండేవాడు. అలా ఇంటికి వచ్చినప్పుడు సుమారు రూ. 3 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేశాడు.
ఇంటికి కన్నం వేసిన ఫేస్బుక్ మిత్రుడు - ఫేస్ బుక్ లో పరిచయంతో దొంగతనం వార్తలు
ఏపీలో ఫేస్బుక్ పరిచయంతో మిత్రుని ఇంటికే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. హాయ్‌తో మొదలుపెట్టి మొత్తం వివరాలు తెలుసుకున్నాడు. ఏదో వంక పెట్టుకుని మీ ఊరు వచ్చా... మీ ఇంటికి రావొచ్చా అంటూ మిత్రుని ఇంటికి వస్తుండేవాడు. అలా వచ్చినప్పుడు ఇంట్లో ఉండే పరిస్థితులను పసిగట్టాడు. ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు అదును చూసుకుని బంగారు ఆభరణాలతో ఉడాయించాడు.
ఇంటికి కన్నం వేసిన ఫేస్బుక్ మిత్రుడు
ఈనెల 1న బంగారు నగలు చోరీకి గురైనట్లు వసంత శ్రీ, ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు... ఫేస్బుక్ కర్నాటి ప్రవీణ్ నిందితుడని నిర్ధరణ చేశారు. నూజివీడు శివాలయం వద్ద ప్రవీణ్‌ను పట్టుకున్న పోలీసులు.. అతని వద్ద నుంచి నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన నూజివీడు గ్రామీణ ఎస్సై సీహెచ్ రంజిత్ కుమార్, సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.