తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అశ్రద్ధ వహిస్తే ఫేస్ 'బుక్' అయినట్టే! - సైబర్ క్రైం న్యూస్

సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతోంది. అరచేతిలో ప్రపంచం చూసే అవకాశం అంతర్జాలం వల్ల లభిస్తోంది. ఇంటర్నెట్ వేదికగా ఎన్నో సౌకర్యాలు ఆందుబాటులోకి వస్తున్నాయి. చరవాణిలోనే పలు అప్లికేషన్లను డౌన్ లోడ్ చేసుకొని ఎప్పుడుపడితే అప్పుడు వినియోగించుకునే సౌలభ్యం ఏర్పడింది. నెట్ వినియోగదారులు పెరగడం వల్ల సైబర్ నేరగాళ్లు మోసాలకు వేదికగా ఎంచుకుంటున్నారు. పలు రకాలుగా మోసాలకు పాల్పడుతూ.. డబ్బులు లాగుతున్నారు.

అశ్రద్ధ వహిస్తే ఫేస్ 'బుక్' అయినట్టే!
అశ్రద్ధ వహిస్తే ఫేస్ 'బుక్' అయినట్టే!

By

Published : Oct 9, 2020, 3:44 PM IST

ఫేస్​బుక్.... దశాబ్దంన్నర కాలంగా ప్రజల నోట్లో మెదులుతున్న పదం. ఎప్పుడో చిన్నప్పుడు విడిపోయిన స్నేహితులు, పరిచయస్థులను సైతం కలుపుతున్న సామాజిక మాధ్యమం. పలు సందర్భాలను పంచుకునేందుకు అనువైన వేదిక. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు చాలామంది ఈ ఖాతాను వినియోగిస్తున్నారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో రోజు మాట్లాడుతారో లేదో కానీ... గంటగంటకు ఫేస్​బుక్ చూడకుండా ఉండలేని వాళ్లున్నారంటే... ఎంతలా మానవ జీవితంలో పెనవేసుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.

వినియోగదారుడి అశ్రద్ధ...

ఫేస్​బుక్​ను వినియోగిస్తున్న వాళ్లు... జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం అశ్రద్ధ వహిస్తున్నారు. ఫేస్​బుక్ వినియోగదారుడి వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా నిర్వాహకులు పలు సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. సెట్టింగ్స్ లోకి వెల్లి ప్రైవసీ అనే ఆప్షన్ ఉపయోగించుకోవడం వల్ల కేవలం మన స్నేహితులకే మన వివరాలు కనిపించేలా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. కానీ వినియోగదారులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఈ సామాజిక మధ్యమాన్ని వినియోగిస్తున్నారు.

నేరగాళ్లకు వరంలా...

సైబర్ నేరగాళ్లు పలు తరహాల్లో అమాయకులను మోసం చేస్తున్నట్లుగానే ఫేస్​బుక్ ద్వారా కూడా నేరాలకు పాల్పడుతున్నారు. వినియోగదారుల నిర్లక్ష్యమే... వారికి వరంగా మారుతోంది. ఫేస్​బుక్ ఖాతాలో వినియోగదారుడి వివరాలన్నీ తెలుసుకొని.... ఫొటోను సైతం సేకరించి నకిలీ ఖాతా తెరుస్తున్నారు. సదరు వినియోగదారుడి తెలిసిన వాళ్లకు... ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు.

సైబర్ వల...

అవతలి వ్యక్తులు ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించిన వెంటనే... సైబర్ నేరగాడు సంభాషణలు జరుపుతున్నాడు. ఎదుటి వ్యక్తి సైబర్ నేరగాడు అనే విషయం తెలియక ఇవతలి వ్యక్తి కూడా సమాధానాలు ఇస్తాడు. ఇదే అదునుగా చూసుకొని రెండు మూడు రోజుల తర్వాత సైబర్ నేరగాళ్లు అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని సందేశం పంపడం... ఇవతలి వ్యక్తి నిజమేనేమో అని డబ్బులు పంపడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

పోలీసులే లక్ష్యం...

ఇన్నాళ్లు సాధారణ వ్యక్తుల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించిన సైబర్ నేరగాళ్లు... ఇప్పుడు పోలీసులనే లక్ష్యంగా చేసుకున్నారు. ఖాకీ దుస్తులు వేసుకున్న అధికారులను ఎంపిక చేసుకొని వాళ్ల పేరుతో నకిలీ ఫేస్​బుక్ ఖాతాలు సృష్టిస్తున్నారు. మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా, నల్గొండ ఎస్పీ రంగనాథ్, సంగారెడ్డి డీఎస్పీ, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐ ముత్తు, బంజారాహిల్స్ ఎస్సై నాయుడు... ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో పోలీసు అధికారుల పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్ బుక్ ఖాతాలను సృష్టించారు.

నకిలీ ఖాతాల ద్వారా నగదు...

నల్గొండ ఎస్పీ రంగనాథ్ పేరుమీద నకిలీ ఖాతా తెరిచిన నేరగాళ్లు... ఆయన స్నేహితులతో సంభాషించారు. నగదు కావాల్సిందిగా కోరారు. వెంటనే రంగనాథ్ స్నేహితులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా... దాన్ని బ్లాక్ చేశారు. స్వాతి లక్రా పేరుతోనూ నకిలీ ఖాతా తెరవగా... విషయాన్ని తెలుసుకున్న ఆమె వెంటనే తన అసలైన ఫేస్ బుక్ ద్వారా విషయాన్ని తెలియజేశారు. తన పేరుతో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులను ఎవరూ అంగీకరించొద్దని... ఒకవేళ అంగీకరించినా వెంటనే తొలగించాలని స్వాతి లక్రా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా కోరారు.

350కి పైగా...

స్వాతి లక్రాకు విషయం తెలిసిపోయిందని గుర్తించిన సైబర్ నేరగాళ్లు వెంటనే ఆమె నకిలీ ఖాతాను తొలగించేశారు. రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాకు చెందిన సైబర్ నేరగాళ్లు ఇలా పోలీస్ అధికారుల పేరుతో నకిలీ ఫేస్​బుక్ ఖాతాలు తెరుస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రంగనాథ్ నకిలీ ఫేస్​బుక్ ఖాతా కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. రాష్ట్రానికి చెందిన 80మందికి పైగా పోలీస్ అధికారులతో పాటు... ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్​కు చెందిన 350 మందికి పైగా పోలీస్ అధికారుల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించినట్లు నల్గొండ పోలీసుల దర్యాప్తులో తేలింది.

నిర్ధరించుకున్న తర్వాతే...

అదనపు డీజీ స్వాతిలక్రా నకిలీ ఫేస్​బుక్ ఖాతా కేసులోనూ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పంజాబ్ ప్రాంతానికి చెందిన వాళ్లుగా గుర్తించారు. ఈ ఖాతా వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని... ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినా లేదా డబ్బుల పంపించాలని కోరినా సదరు వ్యక్తితో ఒకసారి మాట్లాడి నిర్ధరించుకున్న తర్వాతే ముందుకు సాగాలాని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:పోలింగ్​ ఏర్పాట్లు పూర్తి.. ఓటేసేందుకు సిద్ధంకండి..

ABOUT THE AUTHOR

...view details