కొవిడ్ మహమ్మారి కారణంగా చాలామంది కొలువులు కోల్పోయి.. వేతనాల్లో కోత పడి అనేక ఆర్ధిక ఇబ్బందుల్లో పడిపోయారు. తెలిసినవాళ్లనెవరినైనా అప్పు అడుగుదామన్నా.. ఇంచుమించు అందరిదీ ఇదే పరిస్ధితి. రోజు గడిచే మార్గం లేక ఆకలితో పస్తులుండలేక రుణ యాప్‌లకు ఆకర్షితులవుతున్నారు. వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని.. సంస్ధలు సదరు వ్యక్తులను పీల్చి పిప్పి చేస్తూ.. వేధింపులకు గురి చేసిన ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగు చూశాయి. తాజాగా ముగ్గురు నిందితులను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
జనగామ జిల్లాలో గుడ్లగడ్డ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు ఫాస్ట్ క్రెడిట్ యాప్ ద్వారా రూ.4 వేలు రుణంగా పొందాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రుణం సకాలంలో చెల్లించలేకపోయాడు. ఫలితంగా ఫోన్ ద్వారా వేధింపులకు గురయ్యాడు. బాధితుడి బంధుమిత్రుల ఫోన్ నంబర్లకు యాప్ నిర్వాహకులు అభ్యంతరకరమైన సందేశాలను పంపించారు. దీంతో బాధితుడు జనగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... వరంగల్ సైబర్ క్రైం, జనగామ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి బెంగళూరులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
బెంగళూరులో కంపెనీ పెట్టి
బెంగళూరుకు చెందిన దేబాశిస్ దాస్ గుప్తా, సంజయ్, సంతోష్ నాయక్, మరో ఇద్దరు ప్రధాన నిందితులు ఈ యాప్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరి నుంచి 3 సెల్ ఫోన్లు, 2 ల్యాప్ టాప్‌లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపార వీసాపై గతేడాది ఇక్కడకు వచ్చిన చైనా దేశస్థుడు.. ఎర్రీక్ పెగ్లూ, ఒడిశాకు చెందిన పాడ్రా బ్రిన్దాయ్తో కలసి.. నాలుగు రకాల ఇన్ స్టంట్ యాప్ లోన్లను రూపొందించాడు. 'షైన్ బే టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్' పేరుతో బెంగళూరులో ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు.