ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరంపాలెం ఠాణాలో అటాచ్మెంట్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న గోగిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఏలూరు రేంజి అధికారులు కేసు నమోదు చేశారు. తొలుత అగ్నిమాపక శాఖలో పనిచేసిన ప్రభాకర్ రెడ్డి.. 2011 ఎస్.ఐ రిక్రూట్మెంట్లో పాల్గొని అర్హత సాధించారు. అనంతరం తన ధ్రువపత్రాలను ఏలూరు రేంజి ఐజీ కార్యాలయంలో అందజేశారు. రిక్రూట్మెంట్ సమయానికి రెండేళ్లు వయస్సు అధికంగా ఉన్న ప్రభాకర్ రెడ్డి... తాను ఎన్సీసీలో ఇన్స్ట్రక్షన్గా పనిచేసినట్టు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారు. ఎన్సీసీ ఇన్స్పెక్టర్కు మూడేళ్ల వయసు సడలింపు అవకాశముంటుంది. తద్వారా 2014లో ఎస్ఐగా పోస్టింగ్ సాధించారు.
తప్పుడు ధ్రువపత్రాలతో ఎస్ఐ ఉద్యోగం.. తర్వాత ఏమైంది..? - Guntur Crime news
నకిలీ ధ్రువపత్రాలతో పోలీసు శాఖలో ఉద్యోగం పొందిన ఎస్సై గోగిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని.. ఏపీలోని ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని గుంటూరు పశ్చిమ డీఎస్పీ రమణకుమార్ తెలిపారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయన్నారు. 3 రోజుల నుంచి ప్రభాకర్ రెడ్డి విధులకు రావడం లేదని.. నగరంపాలెం సిబ్బందికి, తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లాడని డీఎస్పీ తెలిపారు.
తొలి నుంచి వివాదాస్పదుడిగా పేరున్న ప్రభాకర్ రెడ్డి.. ప్రకాశం జిల్లా కొమరోలులో పనిచేస్తున్న సమయంలో అక్కడ ఎంపీడీవోతో గొడవపడ్డాడు. ఎస్ఐ తీరుపై అనుమానం వచ్చిన ఎంపీడీవో గుంటూరు రేంజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు మార్కాపురం డీఎస్పీని విచారించాలని చెప్పారు. ఈ క్రమంలో నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన విషయం వాస్తవమేనని విచారణలో వెల్లడైనట్టు సమాచారం. దీనిపై స్పందించిన గుంటూరు పశ్చిమ ఇంఛార్జి డీఎస్పీ రమణకుమార్.. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయన్నారు.