తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మామూళ్లు మామూలే.. డీజిల్‌ దందా ఆగలే! - diesel thefts in Telangana

ఆయిల్‌ ట్యాంకర్లే వారికి కల్పతరువు. ఓ పక్కన నిలపడం, క్షణాల వ్యవధిలో ఇంధనాన్ని చోరీ చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఇందుకు ఎవరినైనా దారికి తెచ్చుకుంటారు. మామూళ్లతో పోలీసుల కళ్లు గప్పుతారు. ఇలాంటి వ్యవహారంలో గతంలో అయిదుగురు పోలీసులపై వేటు పడినా అక్రమార్కుల దందాకు మాత్రం అడ్డుకట్ట పడలేదు.

Eenadu and Etv bharat investigation on diesel mafia in Hyderabad
హైదరాబాద్​లో డీజిల్ దందా

By

Published : Sep 11, 2020, 12:12 PM IST

నాచారం ఠాణా మల్లాపూర్‌ డివిజన్‌ గోకుల్‌నగర్‌ కేంద్రంగా డీజిల్‌ దందా కొనసాగుతున్నట్లు ‘ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ట్యాంకర్ల యూనియన్‌లోని కొందరు వ్యక్తుల కనుసన్నల్లో జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ‘నాకు 4 ట్యాంకర్లున్నాయి. పెట్రోల్‌ను ముట్టుకోం. డీజిల్‌ మాత్రం తీస్తాం. అలా చేయకుండా ఏ ఒక్కరూ ఈ వ్యాపారం చేయలేరు’ అని ఓ ట్యాంకర్‌ యజమాని చెప్పడం గమనార్హం.

భాగ్యనగర పరిధిలో డీజిల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. కొంతమంది అక్రమార్కులు దర్జాగా డీజిల్‌ తస్కరించి నల్లబజారులో విక్రయిస్తున్నారు. పైగా ఎవరికి ఫిర్యాదు చేస్తారో చేసుకోండి.. మమ్మల్ని ఎవరేం చేయలేరంటూ సవాలు విసురుతున్నారు. చర్లపల్లి, చెంగిచెర్ల, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో చమురు సంస్థల గోదాములున్నాయి. రోజుకు సగటున 300 ట్యాంకర్లలో పెట్రోల్‌, డీజిల్‌ను బంకులకు తరలిస్తుంటారు. నల్లబజారులో డీజిల్‌కు గిరాకీ ఉండడంతో కొందరు స్థానికులు, డ్రైవర్లతో కలిసి ఒక్కో ట్యాంకరు నుంచి 20-30 లీటర్ల వరకు తీసేవారు. లీటరు రూ.50-60 వరకు క్యాబ్‌లు, ఆటోలు, లారీలు, విద్యాసంస్థల బస్సులకు విక్రయించేవారు. ఈ క్రమంలో గతంలో భారీ అగ్ని ప్రమాదాలు జరగడంతో రాచకొండ పోలీసులు కఠినంగా వ్యవహరించారు. దందాకు కొంత అడ్డుకట్ట పడింది.

నెలవారీ ఇస్తూ..

లాక్‌డౌన్‌లో డీజిల్‌ చోరీ వ్యవహారం మళ్లీ మొదలైంది. పోలీసులు అక్రమార్కులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో రాచకొండ సీపీ క్షేత్రస్థాయిలో విచారణ చేయించారు. మే నెలాఖరులో ఎస్‌వోటీ సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌, ముగ్గురు పెట్రోలింగ్‌ సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. ఇంధన దందాపై కఠినంగా వ్యవహరించాలంటూ మేడిపల్లి, నాచారం, కుషాయిగూడ, ఘట్‌కేసర్‌ పోలీసులను ఆదేశించారు. అయినా అక్రమార్కులు అడ్డాలను ఏర్పాటుచేసి యథావిధిగా కానిచ్చేస్తున్నారు.

అంతా ‘ఓపెన్‌’ ప్లాట్లలోనే..

ట్యాంకర్ల యజమానులు గోకుల్‌నగర్‌లో ఖాళీ స్థలాలను కొనుగోలు చేసి తాత్కాలిక నిర్మాణాలు కట్టుకున్నారు. మరమ్మతులు, భోజన విరామం, ఇతరత్రా కారణాలతో డ్రైవర్లు ట్యాంకర్లను ఇక్కడికి తీసుకొస్తారు. పైపులతో 2-5 నిమిషాల్లోనే డబ్బాల్లోకి ఇంధనాన్ని ఒంపుతారు. ఇక్కడ ఒక్కచోటే రోజూ 100 ట్యాంకర్లు కన్పిస్తాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details