ఈనెల 26న సరూర్‌నగర్ రైతు బజార్ వెనక ఏర్పాటు చేసిన తాత్కాలిక పండ్ల మార్కెట్‌లోని పాడుబడ్డ సంపును శుభ్రం చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరిశీలించిన పోలీసులు, మృతి చెందిన వ్యక్తి 25 ఏళ్ల యువకుడని, పదేళ్ల క్రితమే చనిపోయినట్లుగా భావిస్తున్నారు.
హత్య చేశారా.. ఆత్మహత్యకు పాల్పడ్డాడా? - Did him commit suicide?or murder at saroor nagar latest news
సరూర్‌నగర్ రైతు బజార్ వెనక ఏర్పాటు చేసిన తాత్కాలిక పండ్ల మార్కెట్‌లోని పాడుబడ్డ సంపులో బయటపడిన ఎముకల గూడుపై పలు సందేహాలు కలుగుతున్నాయి. ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
![హత్య చేశారా.. ఆత్మహత్యకు పాల్పడ్డాడా? The young man's bones were exposed at saroor nagar today news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6971042-34-6971042-1588061319971.jpg)
ఈ ప్రాంతం గతంలో ముళ్లపొదలతో ఉండేది. అటువైపు ఎవరైనా వెళ్లాలంటే జంకేవారు. ఇలాంటి ప్రాంతంలోని పాడుబడ్డ సంపు వద్దకు జనం వచ్చే అవకాశం చాలా తక్కువ. సదరు యువకున్ని ఎవరైనా హత్య చేసి ఉంటారా? ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎముకలతో పాటు టీషర్టు, ప్యాంటు జేబులో 2010కి చెందిన రూ.5 నాణెం, 2009కి చెందిన రూ.1 నాణెం లభించాయి. టీషర్టుపై ఓ స్కూల్ పేరు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఎముకల గూడును ఠాణాలోనే భద్రపర్చారు. లాక్‌డౌన్ అనంతరం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.