నేరస్థులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పెద్దపల్లి డీసీపీ రవీందర్ యాదవ్ అన్నారు. జిల్లాలోని ముత్తారం మండలం పోతారంలో సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. వ్యాపారులు, ట్రాక్టర్ యజమానులు, గ్రామ ప్రజల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో ఎస్సై నరసింహ రావు కృషిని అభినందించారు.
గ్రామంలో ఎటువంటి నేరాలు జరిగినా కెమెరాల వల్ల పోలీసుల దృష్టికి వస్తుందని డీసీపీ తెలిపారు. ప్రతీ ఊరిలో సీసీ కెమెరాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అసాంఘిక శక్తులకు ప్రజలు సహకరించవద్దని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.