మహబూబ్‌నగర్ జిల్లా బాలానగరం మండలం పెద్దరేవల్లికి చెందిన బుచ్చయ్య(55)కు ఆరుగురు ఆడపిల్లలు. మూడో కూతురు అనిత పెళ్లి ఇటీవలే జరిగింది. ఆ వివాహానికి సంబంధించి కల్యాణలక్ష్మి చెక్కులను బాలానగర్ మండల కేంద్రంలో తీసుకునేందుకు తమ స్కూటీపై వెళ్లేందుకు బుచ్చయ్య దంపతులిద్దరు సిద్ధమయ్యారు. ఆ సమయంలో నాలుగో కూతురు శ్రీలత... స్కూటీ తీసుకొని వెళ్ళింది. వాహనం లేనందున బాలానగర్‌కు బుచ్చయ్య భార్య మాత్రమే వెళ్లింది.
పీకలాదాగా తాగి... తండ్రినే కొట్టి చంపిన కూతురు - father died in daughter attack
చెడు వ్యసనాలకు బానిసైన కూతురు తండ్రినే మింగేసింది. "మాకు పని ఉందని తెలిసి స్కూటీ ఎందుకు తీసుకెళ్లావ్" అని అడిగినందుకు మద్యం మత్తులో తండ్రినే కొట్టి చంపింది. క్షణికావేశంలో మిగతా ఐదుగురు కూతుళ్లకు తండ్రిని దూరం చేసి... ఆ ఇంటికి మగదిక్కు లేకుండా చేసింది.
ఇంట్లో బుచ్చయ్య ఒక్కడే ఉండిపోయాడు. మద్యం తాగి ఉన్న బుచ్చయ్య.. ఇంటికి వచ్చిన శ్రీలతను స్కూటీ విషయమై మందలించాడు. అప్పటికే ఫూటుగా మద్యం సేవించి తూగుతున్న శ్రీలతను తండ్రి తిట్టటం వల్ల ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న శ్రీలత తీవ్ర కోపోద్రిక్తురాలై... ఇంట్లో ఉన్న ఇటుకలతో తండ్రిపై దాడి చేసింది. బుచ్చయ్య తలకు బలమైన గాయాలు కాగా... అక్కడే కుప్పకూలాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడే మృతి చెందాడు.
సమాచారం తెలుసుకున్న బాలానగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితురాలు శ్రీలతను అదుపులోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు ప్రయత్నించగా... ఆమె మద్యం మత్తులోనే ఉండటం వల్ల విచారణకు సాధ్యం కాలేదు. నిందితురాలు విచ్చలవిడిగా తిరగడం... మద్యం సేవిస్తూ ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. పలు ఇళ్లలో చోరీలు చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.