సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అనేక రకాల కొత్త ఛాలెంజ్‌లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఫొటోలు అప్లోడ్ చేసే పోటీల విషయంలో చాలామంది ముందు వెనకా ఆలోచించకుండా అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. గతంలో పదేళ్ల ఛాలెంజ్, శారీ ఛాలెంజ్ వంటి ఏవేవో... ఛాలెంజ్‌లు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా కపుల్ ఛాలెంజ్ వచ్చింది. ఈ ఛాలెంజ్‌లో భాగస్వామితో దిగిన ఫొటోలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటే అవి చూసి.. సామాన్యులు కూడా.. పోటీ పడి మరీ.. ఉత్సాహంగా తమ సహచరితో దిగిన ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు.
తీవ్ర ఇబ్బందులు ఉంటాయి
అయితే.. అప్లోడ్ చేసిన ఫొటోలు సైబర్ నేరగాళ్లకు చిక్కితే వ్యక్తిగత జీవితానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కపుల్ ఛాలెంజ్ పేరుతో అప్లోడ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని.. అప్లోడ్ చేసే ముందు తమ వ్యక్తిగత ఖాతా భద్రత సెట్టింగ్స్‌పై దృష్టి పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలను చాలామంది చూసి.. సులభంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా డౌన్లోడ్ చేసిన ఫొటోల్లో యువతులు, మహిళల ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధించిన ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి.
దూరంగా ఉండండి..
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఏం చేసినా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. దానికి ఎవరు లైక్ కొట్టారు.. ఎవరు కామెంట్ చేశారు అని చూసుకోవడం అలవాటుగా మారింది. అయితే ప్రస్తుతం కపుల్ ఛాలెంజ్‌లో భాగంగా మిగతా వారి కంటే ఎక్కువ లైకులు, కామెంట్లు రావాలని.. వివిధ రకరకాల భంగిమల్లో ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫొటోలన్నీ సైబర్ నేరగాళ్లు సులభంగా మార్ఫింగ్ చేసే అవకాశాలున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత భద్రతను జాగ్రత్తగా దాచుకోవడంమే గాక.. తెలియని వారి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దని సూచిస్తున్నారు పోలీసులు. తెలియని వారిని ఫేస్బుక్ ఖాతాలోంచి తొలగించాలని.. ఛాలెంజ్‌లకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సైబర్ మోసగాళ్లతో భద్రం..
ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటి ద్వారా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని పోలీసులు వివరించారు. మరికొందరు సైబర్ నేరగాళ్లు అశ్లీల వెబ్సైట్లలో ఉన్న వీడియోకి ఈ ఫొటోలను ఆపాదిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కపుల్ ఛాలెంజ్ పై పుణే పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పడు కపుల్ ఛాలెంజ్ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. భార్య, కూతురు, తల్లితో దిగిన ఫొటోలను ఛాలెంజ్ యాష్ట్యాగ్లతో సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. ఇప్పటి సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి సైబర్ నేరగాళ్ల ద్వారా బెదిరింపులు ఎదుర్కొన్న బాధితులు తమకు ఫిర్యాదులు ఇస్తున్నారని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఫన్ అండ్ ఫాలోయింగ్ కోసం వ్యక్తిగత ఫొటోలను అప్లోడ్ చేసి.. ఇబ్బందులు, సమస్యలు కొని తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇవీచూడండి:'వ్యవసాయ బిల్లులు రైతుల పాలిట మరణ శిక్షలు'