తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

లింక్​ క్లిక్​ చేస్తే చాలు... ఓటీపీ చెప్పకుండానే ఖాతా ఖాళీ...! - తాజా సైబర్​ నేరాలు

పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞాన్ని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. వినియోగదారుని ప్రమేయం లేనిదే... లావాదేవీలు జరగకుండా బ్యాంకులు పెట్టిన రక్షణ వలయాలను సైతం ఛేదిస్తూ... చోరీ చేస్తున్నారు. లింక్​ క్లిక్​ చేస్తే చాలు... ఓటీపీ కూడా చెప్పకుండానే... ఖాతాలన్నీ ఖాళీ చేసేస్తున్నారు.

cyber fraud for otp special story
cyber fraud for otp special story

By

Published : Dec 26, 2020, 6:52 PM IST

అవతలి వ్యక్తి ఫోన్ చేసి "మీ డెబిట్​/క్రెడిట్​ కార్డు బ్లాక్ అయిపోయింది"అని చెప్పగానే హైరానా పడిపోయి... కార్డు వివరాలతో పాటు... ఖాతా వివరాలు చెప్పేస్తున్నారా...! ఇక మీ ఖాతాలు ఖాళీ అయినట్టే. సైబర్ నేరాలపై పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా... ఏదో ఓ రూపంలో వినియోగదారులు మోసపోతూనే ఉన్నారు. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం డెబిట్, క్రెడిట్ కార్డుల మోసాలే నమోదవుతున్నాయి. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లలో సైబర్ నేరాలు 2500 వరకు నమోదు కాగా... ఇందులో డెబిట్, క్రెడిట్ కార్డు మోసాలు 700కు పైగా ఉన్నాయి.

ఓటీపీ కూడా చెప్పేస్తున్నారు..

సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి కొందరు అమాయకులు... కార్డ్​పై ఉన్న 16 అంకెలు, గడువు తేదీ, సీవీవీ నంబర్​తో పాటు... చరవాణీకి వచ్చిన ఓటీపీ కూడా చెప్పేస్తున్నారు. ఏటీఎం కార్డు బ్లాక్ అయిందనో... లేకపోతే ఖాతా స్తంభించిపోయిందనో... ఆధార్ కార్డు అనుసంధానం చేయాలనో... వంకతో సైబర్ మోసగాళ్లు అమాయకులను మభ్యపెట్టి సాంతం దోచేస్తున్నారు.

బ్యాంకు లావాదేవీల్లో వినియోగదారుల రక్షణ కోసమే ఓటీపీ విధానాన్ని బ్యాంకులు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఒకవేళ డెబిట్, క్రెడిట్ కార్డు పోయినా... ఎవరైనా చోరీ చేసినా... ఖాతా నుంచి నగదు తీసుకునే వీలు లేకుండా ఈ విధానాన్ని ఏర్పాటు చేశాయి. కార్డు దుర్వినియోగం కాకూడదనే దృష్టితో... అన్ని వివరాలు నమోదు చేసినా... ఖాతాదారుడి చరవాణీకి వచ్చిన ఓటీపీ నమోదు చేయకపోతే లావాదేవి సాధ్యం కాకుండా చేశారు. ఇది తెలియక కొందరు అమాయకులు సైబర్​ మోసగాళ్ల మాయలో పడి ఓటీపీని చెప్పేసి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు.

చెప్పకున్నా తెలిసిపోతుంది...

ఈ విషయంపై అవగాహన ఉన్నవాళ్లను సైతం సైబర్​ మోసగాళ్లు బురిడి కొట్టిస్తున్నారు. వినియోగదారుల చరవాణులకు సందేశాల రూపంలో లింకులు పంపిస్తారు. దాని అర్ధం మీ చరవాణిలోకి మాల్​వేర్​ను ప్రవేశపెట్టినట్టే. ఆ లింక్​ను క్లిక్​ చేసిన మొబైల్​ను సైబర్​ నేరగాళ్లు హ్యాక్ చేస్తారు. ఆ చరవాణిలో ఉన్న కార్డు వివరాలతో పాటు ఓటీపీని కూడా తెలుసుకొని ప్రజలను నిండా ముంచుతున్నారు.

గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింకులను ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకు అధికారుల పేర్లతో వచ్చే ఫోన్లను నమ్మి సమాచారం ఇవ్వొద్దని... ఇలాంటి విషయాల్లో అవగాహనతో పాటు అప్రమత్తంగా ఉంటేనే సైబర్​ మోసాల నుంచి బయటపడొచ్చని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:ఐటీ సోదాల్లో రూ.100 కోట్ల నల్లధనం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details