మీ వ్యాలెట్‌ను, బ్యాంక్ ఖాతాను అప్డేట్ చేస్తామని ఫోన్ చేసి వివరాలు సేకరిస్తారు. ఓటీపీ పంపి నంబర్ అడుగుతారు. అటుపై ఖాతాలోని సొమ్ము మెుత్తం మాయం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మరికొంతమంది టీమ్ వ్యూయర్ డౌన్ లోడ్ చేస్తే మేం మీ ఖాతా ఆధునికీకరిస్తామంటూ నమ్మించి ఫోన్లో వివరాలన్ని కాప్చర్ చేసి.. ఆపై బ్యాంక్ ఖాతాలోని నగదు దొంగిలిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలే ఏపీ విజయవాడలోని వన్ టౌన్ పరిధిలో వెలుగుచూశాయి.
వన్ టౌన్‌కు చెందిన ఓ విశ్రాంత బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ ఖాతా నుంచి లక్షన్నర నగదు మాయం చేశారు. మరొకరి ఖాతా నుంచి సుమారు 3 లక్షల రూపాయల మేర నగదును సైబర్ నేరస్తులు దోచేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయటం వల్ల పోలీసులు రంగంలోకి దిగి నిందితులు నగదును ఏవిధంగా వేరే ఖాతాల్లోకి మళ్లించారో గుర్తించారు.