తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

డ్రాగన్ సైబర్ వల.. అమాయకులు విలవిల

క్రిప్టో కరెన్సీ.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌(రమ్మీ).. రుణ యాప్స్‌.. క్లిక్‌ చేస్తే డబ్బులు.. నేడు ‘షేర్డ్‌ బైక్‌(బీకే)/షేరింగ్‌ ఎకానమీ’.. క్లుప్తంగా ‘షేర్డ్‌ బీకే యాప్‌’.. ఇలా రోజుకో తరహాలో చైనీయులు అమాయకుల్ని నిండా ముంచేస్తున్నారు. అక్కడెక్కడో చైనాలో ఉండి.. ఇక్కడ కొందరు పాత్రధారులను తెరపైకి తెచ్చి పోలీసులకు చిక్కకుండా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా సైబరాబాద్‌ పోలీసులు ఛేదించిన ‘షేర్డ్‌ బీకే యాప్‌’ కేసులో పలు విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.

cyber crimes through china applications is increased in telangana
తెలంగాణపై చైనా సైబర్ వల

By

Published : Feb 9, 2021, 9:39 AM IST

ఆన్​లైన్ మోసాలపై పోలీసులు ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. ప్రజలు సైబర్ నేరస్థుల వలలో పడుతూనే ఉన్నారు. రోజుకో రూట్ మారుస్తున్న మాయగాళ్లను పట్టుకోవడానికి ఉపయోగిస్తున్న పోలీసుల టెక్నిక్​లను చైనా కేటుగాళ్లు సవాల్ చేస్తున్నారు. ఇప్పటికే క్రిప్టో కరెన్సీ, ఆన్​లైన్ బెట్టింగ్, రుణ యాప్స్, క్లిక్ చేస్తే డబ్బులంటూ వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతున్న డ్రాగన్ డేంజర్​గాళ్లు ఇప్పుడు షేర్డ్ బీకే యాప్​ తో అమాయకుల్ని ముంచేస్తున్నారు.

గూగుల్‌ ప్లే స్టోర్‌లో పెడితే..

సాధారణంగా ఏ మొబైల్‌ యాప్‌నైనా మనం గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచే డౌన్‌లోడ్‌ చేసుకుంటాం. రుణ యాప్‌ల మోసాలు వెలుగులోకొచ్చిన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానాస్పద లావాదేవీలు నిర్వహిస్తున్న యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించాలంటూ సంబంధిత యాజమాన్యానికి పోలీసులు లేఖ రాశారు. దీంతో కేటుగాళ్లు ‘షేర్డ్‌ బీకే యాప్‌’ను ప్లేస్టోర్‌లో ఉంచలేదు. వివిధ కాల్‌ సెంటర్ల నుంచి ఫోన్‌ నంబర్లను సేకరించారు. వాటికి వాట్సాప్‌లో యాప్‌ లింక్‌ను నేరుగా పంపించారు.

అటెండర్లు, లిఫ్ట్‌ఆపరేటర్లు, డ్రైవర్లు..

అటెండర్లు, లిఫ్ట్‌ ఆపరేటర్లు, డ్రైవర్లు, చిరు వ్యాపారులను ఎంపిక చేసుకుని కంపెనీల్లో డైరెక్టర్లు/అధీకృత ప్రతినిధులుగా నియమిస్తున్నారు. ‘షేర్డ్‌ బీకే యాప్‌’ కేసులో ప్రధాన నిందితుడు ఉదయ్‌ ప్రతాప్‌(41) పేద కుటుంబానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మూడు, నాలుగు కంపెనీల్లో డైరెక్టర్‌గా నియమించినట్లు తేల్చారు. ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన ఝాంగ్‌ హాంగ్‌వే అలియాస్‌ పీటర్‌ ఇప్పటివరకూ భారత్‌కు రాలేదు. ఎనిమిది నకిలీ కంపెనీలను సృష్టించారు. బెంగళూరు, కాన్పూర్‌, పుణే, హైదరాబాద్‌, దిల్లీలో ఉన్నట్లు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌(ఆర్వోసీ)లో రిజిస్టర్‌ చేశారు. గుర్గావ్‌లోని ఒక చిన్న గదికి ఈ ఎనిమిది కంపెనీల పేర్లు బయట పెట్టారు. ఇక్కడి పోలీసులకు చిక్కకుండా కేటుగాళ్లు చైనా, హాంకాంగ్‌ తదితర దేశాల్లోని వెబ్‌సైట్లతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఆయా కంపెనీలు వాటినే తమ అధీకృత వెబ్‌సైట్లుగా చూపిస్తారు. వారికి 10 శాతం నుంచి 20 శాతం వరకు కమిషన్‌ చెల్లిస్తున్నారు. తాజా కేసులోనూ ఇదే జరిగింది. కాన్పూర్‌లోని బ్రిడ్జ్‌ టేరా టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైనాకు చెందిన రమ్మీవిష్‌.కామ్‌, సైబర్‌టెల్‌ ఇన్ఫోటెల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. 51 సైబర్‌టెల్‌.కామ్‌తో ఒప్పందం చేసుకుంది. విదేశాల్లో సర్వర్లు ఉండటంతో మన పోలీసులు అడుగు ముందుకేయలేకపోతున్నారు.

పేమెంట్‌ గేట్‌వేలే కీలకం..

ఈ మోసాల్లో పేమెంట్‌ గేట్‌వేలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం ఆయా కంపెనీలకు మర్చంట్‌ ఐడీ ఇస్తున్నాయి. ఆన్‌లైన్‌లో వినియోగదారులు డబ్బులు చెల్లించగానే ముందుగా ఆ పేమెంట్‌ గేట్‌వే ఖాతాలోకి చేరుతాయి. మరుసటి రోజు కంపెనీ/వ్యక్తి బ్యాంక్‌ ఖాతాల్లో జమవుతుంది. ఆయా పేమెంట్‌ గేట్‌వేలు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే మర్చంట్‌ ఐడీ ఇస్తున్నాయి. తాజా కేసులో ‘రోజర్‌పే పేమెంట్‌ గేట్‌వే’ ప్రతినిధులను ప్రశ్నించేందుకు సైబరాబాద్‌ పోలీసులు సమాయత్తమవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details