తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

స్పీడ్‌ పోస్టులు పంపి ఖాతాలు కొల్లగొట్టేస్తారు.. జాగ్రత్త.! - cyber cheatings in nagaram

ఆన్‌లైన్‌ ద్వారా మోసాలు చేయడంలో సైబర్‌ నేరగాళ్లు నూతన పంథాను అవలంభిస్తున్నారు. ఈ మెయిల్స్‌, సందేశాలు, ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వస్ట్‌లు, వాట్సాప్‌ల ద్వారా అమాయక ప్రజల ఖాతాలను కొల్లగొట్టిన సైబర్‌ కిలాడీలు.. ఇప్పుడు ఆన్‌లైన్‌ సంస్థల పేర్లతో దోపిడీకి యత్నిస్తున్నారు. ఆయా సంస్థల పేర్లతో లక్కీ డ్రిప్‌ పేరిట ఉత్తరాలు పంపి వారి ఖాతాలను కొల్లగొట్టేలా ప్రణాళికలు వేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఇటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

naptol, scratch card, cyber cheatings
సైబర్‌, న్యాప్‌టాల్, ఆన్‌లైన్‌ మోసాలు

By

Published : Jan 7, 2021, 6:27 PM IST

న్యాప్‌టాల్‌, స్నాప్ డీల్, అమెజాన్ వంటి సంస్థల పేర్లతో వచ్చే ఉత్తరాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అమాయకులను మోసం చేయడానికి సైబర్‌ నేరగాళ్లు కొత్త ఉచ్చులు బిగిస్తున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లక్కీ డ్రిప్‌ పేరిట ఉత్తరాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో తాజాగా ఈ తరహా మోసానికి దుండగులు యత్నించారు.

జిల్లాలోని కమాన్‌పూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన గడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తికి ఈ నెల 2న ఒక స్పీడ్ రిజిస్టర్ పోస్ట్ సీల్డ్ కవర్ అందింది. అందులో ఒక లెటర్‌పై క్యూఆర్‌ కోడ్‌తో పాటు ఆ పత్రంపై బ్యాంక్ వివరాలు నింపి వాట్సాప్ ద్వారా ఫోటో పంపమని ఉంది. అనంతరం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్ చేయమని ఉంది. ఇందులో ఏదో మోసం ఉందని గ్రహించిన శ్రీనివాస్.. కమాన్ పూర్ పోలీసులను ఆశ్రయించాడు.

ఎలా దోచుకుంటారు?

మోసం చేయాలనుకున్న వారి పూర్తి చిరునామా సేకరించి ఆ అడ్రస్‌కు స్పీడ్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఒక ఉత్తరాన్ని పంపిస్తూ ఈ లక్కీ డ్రిప్‌లో మీరే మొదటి వ్యక్తి అని నమ్మిస్తారు. దానికి గాను రవాణా ఖర్చులు, పన్నులు, రిజిస్ట్రేషన్ ఫీజుల పేరిట డబ్బు వసూలుకు యత్నిస్తారు. ఆ ఆఫర్లను నమ్మి నగదు బదిలీ చేస్తే నట్టేట మునిగినట్టే.. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిన దరఖాస్తులో క్యూఆర్‌ కోడ్‌, బ్యాంక్ వివరాలు నింపి వాట్సాప్ ద్వారా ఒక మొబైల్ నంబరుకు పంపమని అడుగుతారు. న్యాప్‌టాల్‌ స్క్రాచ్ కార్డు ద్వారా రూ. 5లక్షల బహుమతి పొందారని ఒక బ్యాంక్ అకౌంట్ చెప్తూ ఐఎఫ్‌ఎస్‌సీ నంబర్‌తో నగదు పంపించమంటారు.

అప్రమత్తంగా ఉండండి

ఇలాంటి కంపెనీల పేరిట వచ్చే ఉత్తరాలను నమ్మి ఎలాంటి లావాదేవీలు చేయవద్దని పెద్దపల్లి పోలీసులు సూచించారు. ఆ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదు సదరు వ్యక్తికి వెళ్లిపోతుందని వెల్లడించారు. డబ్బులు ఎవరికీ ఊరికే రావని.. ప్రైజ్ మనీ, గిఫ్ట్‌లు, లక్కీడ్రాల పేరిట కొత్త తరహా మోసాలకు యత్నిస్తారని తెలిపారు. వాటికి ఆశపడి వాళ్లు పంపించిన లింకులపై క్లిక్‌ చేస్తే ఉన్న డబ్బులు పోతాయని హెచ్చరించారు. ఇలాంటి అపరిచితులు పంపే లెటర్లపై స్పందించకూడదని కోరారు. వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు.

ఇదీ చదవండి:పది రూపాయల కోసం ప్రాణాలు తీశాడు..

ABOUT THE AUTHOR

...view details