మాయ మాటలతో సైబర్ నేరగాళ్లు ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పలువురికి ఫోన్‌లో మాయమాటలు చెప్పి లక్షలు కాజేశారు. బేగంపేట్‌కు చెందిన ఓ మహిళకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీకు గిఫ్ట్ ఓచర్ వచ్చిందని.. సొమ్మును ఫోన్‌పే ద్వారా చెల్లిస్తామని చెప్పి ప్రొసెసింగ్ ఫీజ్కోసం ప్రొసెసింగ్ టూ పే రిక్వెస్ట్ పంపారు. మహిళ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాకు నగదు బదిలీ అయినట్లు గుర్తించిన మహిళ వారిని ప్రశ్నించగా డబ్బును వెనక్కి పంపేస్తామని... క్విక్‌సపోర్ట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. వారు చెప్పినట్లు చేసి అందులో బ్యాంకు వివరాలు నమోదు చేసిన వెంటనే ఖాతా నుంచి రూ.2,35,000 ఖాళీ చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది.
ఇలాంటివే కొన్ని
మరో ఘటనలో పేటీఎం కేవైసీ అప్‌డేట్ చేయాలంటూ క్విక్ సపోర్టు యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి... మలక్‌పేట్‌కు చెందిన ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.51,000 సైబర్‌నేరగాళ్లు స్వాహా చేశారు. దక్షిణ మధ్య రైల్వేలో లోకోపైలెట్‌గా పనిచేసే ఓ ఉద్యోగితో క్విక్‌సపోర్ట్ యాప్ డౌన్‌లోడ్ చేయించి రూ.80,000 కాజేశారు. ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌లో సెకెండ్ హ్యాండ్ హోండాయాక్టివా కొనేందుకు ప్రయత్నించగా... తక్కువ ధరకు విక్రయిస్తామని ముందుకొచ్చిన సైబర్ నేరగాళ్లు అడ్వాన్స్, రవాణా ఛార్జీల పేరుతో రూ.57 వేలు వసూలు చేశారు. ఆయా ఘటనల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:సిబ్బంది అపార్థం చేసుకోవద్దు.. లోపాలను సరిదిద్దాలనే.. : హైకోర్టు