సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోతూ.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించేవారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఉద్యోగం ఇస్తామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.2.10 లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. మెట్టుగూడకు చెందిన తిమోతి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. తన వివరాలను నౌకరి డాట్ కామ్‌లో ఆప్లోడ్ చేశారు. రెండురోజుల క్రితం ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తాము అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ ప్రతినిధినంటూ పరిచయం చేసుకున్నాడు. మీ అర్హతకు తగిన ఉద్యోగం ఉందని చెప్పి.. ఇంటర్వూ, ప్రాసెసింగ్ రుసుం ఇలా రకరకాల కారణాలతో రూ.2.10 లక్షలు తన ఖాతాలో జమ చేయించుకున్నాడు. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.
మరో కేసులో యూసుఫ్ గూడకు చెందిన అబ్దుల్ సయ్యద్ బ్యాంక్‌కు వెళ్లి తన ఖాతాకు సంబంధించిన స్టేట్మెంట్ తీసుకున్నారు. దాన్ని పరిశీలించి ఒక్కసారిగా అవాక్కయ్యారు. తన ఖాతాలోంచి 90 వేలు విత్‌డ్రా అయినట్లుగా గుర్తించి బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.