మృత్యబావి కేసులో దోషికి ఉరి శిక్ష ఖరారు వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట మృత్యబావి కేసులో దోషి.. సంజయ్‌కుమార్‌కు ఉరి శిక్ష ఖరారు చేస్తూ.. వరంగల్ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కే.జయకుమార్ తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబంధించి.. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, క్లూస్ టీం, సాంకేతిక బృందం.. ఇలా మొత్తం ఆరు బృందాలతో దర్యాప్తు చేసిన పోలీసులు.. కేసు మిస్టరీని 72 గంటల్లోనే చేధించి బిహార్ వాసి సంజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. 485 పేజీల చార్జ్‌షీటు
ఒక హత్యను కప్పిపుచ్చుకోవడానికి.. తొమ్మిది మందిని హత్యచేసినట్లు పోలీసులు వెల్లడించారు. 25 రోజుల్లోనే కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. రికార్డు స్ధాయిలో 485 పేజీల చార్జ్‌షీటు దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నెల రోజుల్లోనే కేసు విచారణ పూర్తి చేసిన వరంగల్ కోర్టు..సంజయ్‌కుమార్‌కు ఉరిశిక్ష విధించింది. నేరం రుజువైందని..శిక్ష ఖరారైందని పేర్కొన్న న్యాయమూర్తి..ఏమైనా చెప్పాల్సి ఉందా అని సంజయ్‌ను ప్రశ్నించగా.. తొమ్మది మందిని ఎలా హత్యచేయగలనంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. మరణశిక్షతోపాటు విషప్రయోగం, చోరీ, ఆస్తి స్వాహా చేసేందుకు యత్నాలు..ఇలా మరో నాలుగు నేరాల కింద కోర్టు మూడు వేల జరిమానాతోపాటు పలు శిక్షలు విధించింది. ప్రాసిక్యూషన్ తరపున కేసు వాదించిన న్యాయవాది సత్యనారాయణ..తీర్పు పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
పోలీసులు హర్షం
సంజయ్‌కుమార్‌కు ఉరిశిక్ష విధించడంపై పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. కేసును దర్యాప్తు చేసిన అధికారులు..పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. ఈ కేసును సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేశామని..తమ కృషికి ప్రతిఫలం లభించిందని తెలిపారు.
ఇద్దరికీ ఉరిశిక్షలు
ఏడాది వ్యవధిలో ఇద్దరు నేరస్తులకు ఉరిశిక్ష వేసిన ఘనతను న్యాయమూర్తి కె. జయకుమార్ సాధించారు. 2019 ఆగస్టు 8న తొమ్మిది నెలల పసికందు అత్యాచార, హత్య ఘటనలకు సంబంధించి..ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించారు. ఇప్పుడు తొమ్మిది మందిని హత్యచేసిన సంజయ్‌కుమార్‌కు మరణశిక్ష విధించారు. ఈ రెండు కేసుల్లోనూ విచారణ త్వరగా పూర్తిచేయడం ఓ రికార్డు కాగా..ఇద్దరికీ ఉరిశిక్షలు పడడమూ రికార్డే. అతి తొందరగా తీర్పు వెలువడటం న్యాయ వ్యవస్థ మీద అందరికీ మరింత నమ్మకం పెంచుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. శిక్ష ఖరారు కావడం వల్ల సంజయ్‌ను తిరిగి పోలీసులు వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు.
ఇదీ చూడండి :48 గంటలు సమయమిస్తే.. పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు..