తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

3 నెలల్లో మీ డబ్బు 4రెట్లు అవుతుంది.. చైనీయుల కొత్త మోసం

చైనీయులు ఆన్‌లైన్‌ వేదికగా సరికొత్త మోసాలకు తెగబడుతున్నారు. ఈ దోపిడీలను గ్రహించి పోలీసులు అప్రమత్తమయ్యే లోపు... మరో తరహా మోసానికి తెరలేపుతున్నారు. ఇప్పటికే క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్, ఆన్‌లైన్ గేమింగ్, లోన్‌యాప్, స్పిన్‌వీల్ పేరుతో మోసాలకు పాల్పడిన చైనీయులు... ఇప్పడు అధిక వడ్డీ పేరుతో డబ్బులు దండుకుంటున్నారు. షేర్‌ ఎకనామీ అప్లికేషన్ పేరుతో పెట్టుబడులు స్వీకరించి 20వేల మందిని మోసం చేసిన ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా వెనక ఉన్న ఇద్దరు చైనీయుల కోసం గాలిస్తున్నారు.

By

Published : Feb 8, 2021, 7:48 PM IST

Updated : Feb 8, 2021, 10:33 PM IST

Chinese new type of cyber cheatings in hyderabad
చైనీయుల కొత్త మోసాలు.. అధిక వడ్డీ ఆశ చూపి అమాయకులకు టోకరా

ఏదైనా బ్యాంకులో, ఫైనాన్స్‌లో డబ్బులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేస్తే... కనిష్ఠంగా 5శాతం.. గరిష్ఠంగా 12 శాతం కంటే వడ్డీ రాదు. లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే... బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నిబంధనలకు అనుగుణంగా రూ. 500 నుంచి రూ. వేయి వరకు వస్తుంది. ఐతే షేర్ ఎకానమీ అనే అప్లికేషన్ ద్వారా పెట్టుబడులు పెడితే 3 నెలల్లో మీ డబ్బు 4రెట్లు ఎక్కువ అవుతుంది. మీరు రూ.15వేలు డిపాజిట్ చేస్తే 3నెలల్లో 67వేల 500 చెల్లిస్తారు. ఇలా ఆశ చూపి దాదాపు 20వేల మంది వద్ద కోట్ల రూపాయల డిపాజిట్లు స్వీకరించిన చైనాకు చెందిన కంపెనీలు బోర్డు తిప్పేశాయి.

మొదట్లో చెల్లించినా..
అధిక వడ్డీ వస్తుందనే ఆశతో చిరు వ్యాపారుల నుంచి మొదలు ధనికుల వరకు 20వేల మంది రూ. 50కోట్ల పెట్టుబడులు పెట్టారు. అమాయకులను ఆకర్షించడానికి మొదట్లో డబ్బులు సక్రమంగా చెల్లించిన చైనా కంపెనీలు క్రమంగా పెట్టుబడులు పెరిగిన తర్వాత... కార్యకలాపాలు నిలిపేశాయి. గత నెల 25న షేర్ ఎకానమీ అప్లికేషన్ అంతర్జాలంలో కనిపించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆర్థిక నేరం కావడంతో కేసును సైబరాబాద్ ఆర్థిక నేర విభాగానికి బదిలీ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన అధికారులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి 4 ల్యాప్‌టాప్​లు, 10 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.3కోట్లు తాత్కాలికంగా జప్తు చేశారు. నిందితుల్లో దిల్లీకి చెందిన ప్రతాప్, రాజేశ్, నితీశ్ తెర మీద ఉండగా... తెర వెనక చైనాకు చెందిన జాంగ్‌హాంగ్ వెయ్, పెంగ్ గౌవెయ్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

కాగితాల కంపెనీలు

డొల్ల కంపెనీలు స్థాపించి.. ప్రతాప్, రాజేశ్, నితీశ్​ను డైరెక్టర్లుగా నియమించిన ఇద్దరు చైనీయులు... వాటి ద్వారా ప్రజలు నుంచి పెట్టబడులు స్వీకరించారు. బెంగళూర్, దిల్లీ, కాన్పూర్, పుణెలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల వద్ద పలు కంపెనీలు నమోదు చేసినా... అవన్నీ కేవలం కాగితాలపైనే ఉన్నాయని... ఎక్కడా కూడా వాటికి కార్యాలయాలు లేవని దర్యాప్తులో తేలింది. బెంగళూర్​లో అలీదాదా, హైదరాబాద్​లో మొబిసెంట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్​ను స్థాపించినట్లు కాగితాల్లో చూపించారు.

మన దేశంలోని పేమెంట్ గేట్ వేలకు చైనీయుల వెబ్ సైట్లు లింకు కావాలంటే స్థానికంగా కంపెనీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికోసం స్థానికంగా ఉండే వాళ్లను డైరెక్టర్లుగా నియమించుకొని.... వాళ్లతో తతంగం నడిపిస్తున్నారు. ఇలాంటి చైనీయుల మోసాలకు సహకరించకుండా.. సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:పాన్ కార్డుతో నకిలీ వైద్యుడి గుట్టురట్టు

Last Updated : Feb 8, 2021, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details