అపహరణకు గురైన చిన్నారి
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జల్లా ముండ్లమూరు మండలం రెడ్డినగర్‌కు చెందిన బాలుడు ఆరుష్‌రెడ్డి కిడ్నాప్ మరువక ముందే దర్శిలో మరో పసిపాప కిడ్నాప్‌కు గురికావడం కలకలం రేపింది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించటంతో సంఘటన జరిగిన రెండు గంటల్లోనే నిందితురాలు దొరికిపోయింది. చిన్నారి తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేరింది. దొనకొండ మండలం పోలేపల్లి అంగన్‌వాడీ కార్యకర్తను గుర్తు తెలియని మహిళ కలిసి ఇటీవల జన్మించిన ఆడపిల్లలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుందని, అలాంటి వారు ఉంటే చెప్పాలని నమ్మబలికింది. ప్రతి తల్లీ తన చిన్నారితో ఫొటో దిగితే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయిస్తానని, అందుకు వారిని దర్శికి పంపాలని కోరింది. ఆమె మాటలు నమ్మిన కార్యకర్త నలుగురు తల్లులను తమ పిల్లలతో దర్శికి వెళ్లాలని సూచించింది. దాంతో వారిలో ముగ్గురు తమ భర్తలతో, కొమ్ము మరియమ్మ తన బంధువుతో అక్కడకు మధ్యాహ్నం చేరుకున్నారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సదరు మహిళ మరియమ్మను నీరసంగా ఉన్నావు, వైద్యశాలకు వెళదామనే నెపంతో ఇతరుల నుంచి వేరు చేసింది. అద్దంకి రోడ్డులో ఉన్న స్టూడియోలో ఫొటో తీసుకురమ్మని చెప్పి ఆమె చేతుల్లోని పాపను తీసుకుంది. ఫొటో తీయించుకొని బయటకు వచ్చిన మరియమ్మకు తన చిన్నారి, మహిళ కనిపించకపోవడంతో చుట్టుపక్కలంతా వెతికి 2 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.