తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అంతా మాయ: గొలుసు కట్టు పేరుతో గిరిజనులకు టోకరా - Nirmal District News

మీరు చేరి.. మరో నలుగురిని చేర్పిస్తే.. జీవితాంతం డబ్బులు వస్తూనే ఉంటాయి అంటూ.. కొమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో గొలుసుకట్టు వ్యాపారం రోజురోజుకూ విస్తరిస్తోంది. లక్షలు సంపాదించవచ్చు అని ఆశ చూపి.. అమాయక గిరిజనులను మోసం చేస్తూ.. కోట్లు దండుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఏకంగా ఉపాధ్యాయులు, సర్పంచులు సైతం ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. వ్యవసాయం చేసి సంపాదించిన కాస్త డబ్బు గొలుసుకట్టు వ్యాపారంలో పెట్టి అమాయక గిరిజనులు చేతులు కాల్చుకుంటున్నారు.

Chain System Business Developing In Adilabad District
ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో.. చాపకింద నీరులా గొలుసుకట్టు వ్యాపారం

By

Published : Oct 5, 2020, 2:43 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో గొలుసుకట్టు వ్యాపారం రోజురోజుకు వేళ్లూనుకుంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా వ్యాప్తంగా గొలుసుకట్టు ఏజెంట్లు గిరిజనులే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. ఒక్క సభ్యుడు రూ.2500 చెల్లించి చేరి.. మరో నలుగురిని చేర్పిస్తే వారు కట్టిన సొమ్ము తిరిగి ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత గ్రేడ్​ ప్రకారం డబ్బులు ఇస్తూ.. గిరిజనులను ఆకర్షిస్తున్నారు. ఈ వ్యాపారంలో గిరిజనులు, ఆదివాసీలతో పాటు.. గిరిజన ఉపాధ్యాయులు, సర్పంచులు కూడా ఉండటం గమనార్హం.

తరతరాలుగా ఆదాయం వస్తుందని..

లాక్​డౌన్ సమయంలో మొదలైన ఈ దందా.. ఏజెన్సీ ప్రాంతంలో వేగంగా పుంజుకుంటోంది. వందలాది మంది ఆదివాసీలు కూలిపనులు, పోడు వ్యవసాయం చేస్తూ వచ్చిన కొద్ది మొత్తాన్ని ఈ వ్యాపారంలో పెట్టి మోసపోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.150 కోట్లు దందా నడుస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 2,500 రూపాయలు చెల్లించి సభ్యుడిగా చేరిన వ్యక్తి మరో నలుగురిని చేర్పిస్తే మొదట డబ్బులు కట్టిన వ్యక్తికి 2500 రూపాయలు తిరిగి ఇస్తున్నారు.

ఆ వ్యక్తి కింద మరో నలుగురు, వారు ఇంకో నలుగురు ఇలా అంతు లేకుండా సాగుతున్న గొలుసుకట్టు మోసం వల్ల వ్యక్తుల గ్రేడులు సిల్వర్, గోల్డ్, డైమండ్ ఇలా మారుతున్నాయి. ఇందుకు అనుగుణంగా ఎన్ని ఏళ్ళు అయినా మీకు మీ తర్వాత తరానికి కమిషన్ ఇస్తామని నిర్వాహకులు మాయమాటలు చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత ఆరు నెలల కాలంలో మూడు వేల మందికి పైగా ఈ సంస్థలో సభ్యులుగా చేరినట్లు తెలుస్తోంది.

నమ్మించి.. ముంచేస్తున్నారు

కరోనా కారణంగా ఇంటి వద్దే ఉన్న యువకులకు... డబ్బులు ఆశ చూపించి.. సభ్యులుగా చేర్చుకుంటున్నారు. ఇందులో చేరితే భారీగా సొమ్ము సంపాదించవచ్చని ఆశలు కల్పిస్తున్నారు. మన్యంలో పనిచేసే గిరిజన ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, సర్పంచులు, రాజకీయ నాయకులను నిర్వాహకులు నమ్మించి ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. వారికి ఉన్న పరిచయాల ద్వారా ఆయా గ్రామాల గిరిజనులు సులభంగా నమ్మేసి రూ.2500 కట్టి సభ్యులుగా చేరుతున్నారు.

చేరిన వారికి నమ్మకం కలిగించడానికి కొందరు సభ్యులకు కొంత మొత్తం ముట్ట చెబుతున్నారు. మిగతా వారు సైతం డబ్బులు వస్తాయనే ఆశతో సభ్యులుగా చేరి.. మోసపోతున్నారు. సంస్థ నిర్వాహకులు పదివేల రూపాయలతో కూడిన వంటపాత్రలు, నిత్యావసర వస్తువులు, అలంకార సామాగ్రిని ముందుగా అందిస్తున్నారు. ఊరు, పేరు లేని నాసిరకం వస్తువులు డబ్బులు కట్టి సభ్యులుగా చేరిన వారికి అంటగడుతున్నారు. మరో నలుగురిని రూ.10,000 కట్టించి సభ్యులుగా చేర్పిస్తే 50 శాతం డబ్బును తిరిగి ఇస్తామని ఆశ పెడుతున్నారు. సభ్యులతో ప్రాంతాల వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు.

ఈ ప్రాంతాల్లో అధికం..

గొలుసుకట్టు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు ఏజెన్సీ ప్రాంత ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, బోథ్, బజార్ హత్నూర్ మండలాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, తిర్యాని, కెరమెరి, మోవాడ్, సిర్పూర్ (యూ) మండలాల్లో ఈ వ్యాపారం బాగా విస్తరించింది. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్, జన్నారం, కడెం ప్రాంతాలతో పాటు మంచిర్యాల జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో గొలుసుకట్టు వ్యాపారం క్రమంగా విస్తరిస్తోంది.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు గొలుసుకట్టు వ్యాపారంలోకి అడుగు పెట్టింది. మరో నలుగురిని చేర్పించింది. ఆమె ఫొటోను వాడుకుంటూ.. 90 ఏళ్ల వృద్ధురాలు చేరి.. నలుగురిని చేర్పించింది.. మీరు చేరలేరా అంటూ యువకులను రెచ్చ గొడుతున్నారు. గొలుసుకట్టు వ్యాపారాలు చేస్తూ.. ఆర్థిక నేరాలకు పాల్పడే వారిని గుర్తించి క్రిమినల్ కేసులు పెడతామని... ఇలా ప్రజల నుంచి డబ్బులు సేకరించడం చట్టరీత్యా నేరం, నిషేధమని.. కొమురం భీం జిల్లా ఇంఛార్జి ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. ఇలాంటి వ్యాపారాలకు ఎలాంటి అనుమతులు లేవని.. త్వరలోనే.. పోలీసు శాఖ నుంచి ఏజెన్సీ మండలాలలో అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:హోంమంత్రి ముందే తెరాస నేతల కుమ్ములాట

ABOUT THE AUTHOR

...view details