భాగ్యనగరంలో ఎప్పటికప్పుడు పోలీసులు గొలుసు దొంగలను పట్టుకుంటూనే ఉన్నా.. ఎక్కడో ఒక చోట గొలుసులను తెంపుకెళ్తున్నారు. ఇటీవల కాలంలో ఇలా..
- పదిరోజుల కిందట రాజేంద్రనగర్ ఠాణా కిస్మత్పూర్లో రాత్రి 9 గంటల సమయంలో కిరాణ దుకాణంలో ఉన్న మహిళ మెడలో నుంచి గొలుసును తెంపుకెళ్లారు. ఇప్పటికీ నిందితుల్ని గుర్తించలేదు.
- కొన్ని రోజుల కిందట చింతల్ ఎల్లమ్మ గుడి రోడ్డు ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఉదయపు నడకకు వెళుతున్న మహిళ మెడలో గొలుసును దొంగిలించి మెరుపు వేగంతో పరారయ్యారు. ఇంకా చిక్కలేదు.
- సెప్టెంబరు 30న మల్కాజ్గిరి చాణిక్యపురి కాలనీలోని గ్రాండ్ అపార్ట్మెంట్ కింద జామ ఆకులు కోస్తున్న పి.సువర్ణ(56) మెడలో నుంచి మెరుపు వేగంతో మంగళసూత్రాన్ని(విలువ రూ.90వేలకు పైగా) లాక్కెళ్లాడు. రాచకొండ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆ దొంగను ఈ నెల 3న పట్టుకున్నారు.
- ఈనెల 2న నేరెడ్మెట్ డిఫెన్స్‌కాలనీలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న స్థానికురాలు రావిపాటి ఇందిర(52) మెడలోని గొలుసును తెంచుకొని పరారయ్యాడు. స్థానికుల సాయంతో రాచకొండ పోలీసులు అదే రోజు దొంగను అదుపులోకి తీసుకున్నారు.
- కొన్ని రోజుల కిందట పుప్పాలగూడలో స్కూటీపై వెనుక కూర్చున్న మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన ముగ్గురు గొలుసు దొంగలను సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
అప్పట్లో అంతర్రాష్ట్ర ముఠాలు.. ఇప్పుడేమో..
గతంలో ఎక్కడో చోట వాహనాలను దొంగిలించి, దాని నంబరు ప్లేట్‌ను తొలగించి అరతర్రాష్ట్ర దొంగల ముఠాలు గొలుసు దొంగతనాలకు పాల్పడేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన నగర యువకులే గొలుసు దొంగలుగా మారుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆ జాబితాలో విద్యార్థులు కూడా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క గొలుసును లాక్కెళితే చాలు.. దండిగా డబ్బులొస్తాయనే ఉద్దేశంతోనే అటువైపు అడుగులు వేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. తర్వాత అదే అలవాటుగా మారుతుందని వివరిస్తున్నారు. తాజాగా కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు కూడా గొలుసు దొంగలుగా మారుతున్నారు. ఇటీవల నేరెడ్మెట్, మల్కాజ్గిరి పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు ఆ కోవలోని వారే కావడం గమనార్హం.