ఒక్క నిఘా నేత్రం వంద మంది పోలీసులతో సమానమంటూ... ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్న మాటలు నిజమవుతున్నాయి. పోలీసుల నుంచి కొందరు కళ్లుకప్పి తప్పించుకుంటున్నా నిఘానేత్రాలకు అడ్డంగా దొరికిపోతున్నారు. రహదారి ప్రమాదాల్లో సీసీ కెమెరాలు బాధితులకు అండగా నిలుస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు.. అందుకు కారణమైన వారిని గుర్తించేందుకు ఎంతగానో ఉపయోగపడతున్నాయి. రహదారి ప్రమాదాలకు కారణమైన వారు ఒక్కోసారి తప్పించుకునేందుకు.. తమ తప్పు లేదంటూ బుకాయిస్తున్నారు. ప్రధానంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున జరుగుతున్న ఘటనల్లో ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి.
సిగ్నల్ జంపే కారణం
ఇలాంటి కేసుల్లో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి.. అసలు దోషులెవరో తేలుస్తున్నారు. ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గచ్చిబౌలి విప్రో చౌరస్తా వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో కారు, టిప్పర్ ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని అంతా భావించారు. సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించగా.. కారులో ప్రయాణిస్తున్న యువకులు ట్రాఫిక్ సిగ్నల్ పడినా... ఆపకుండా కుడివైపునకు తిప్పారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న టిప్పర్.. కారును ఢీకొని ఐదుగురు మృతిచెందారని పోలీసులు నిగ్గు తేల్చారు.