తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కానిస్టేబుల్ ఫిర్యాదుతో జేసీ దివాకర్​రెడ్డిపై కేసు నమోదు - ap latest news

ఏపీలోని అనంతపురం జిల్లా పెద్దపప్పూరు పీఎస్‌లో తెదేపా సీనియర్​ నేత జేసీ దివాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. తనను దుర్భాషలాడారన్న కానిస్టేబుల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వి.ఎన్.కె.చైతన్య తెలిపారు

case on jc  diwakar reddy
జేసీ దివాకర్​రెడ్డిపై కేసు నమోదు

By

Published : Jan 5, 2021, 5:45 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన మాజీ ఎంపీ, తెదేపా సీనియర్‌నేత జేసీ దివాకర్‌రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులను అసభ్యపదజాలంతో దూషించారని, విధులకు ఆటంకం కలిగించారని పెద్దపప్పూరు పోలీస్​స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వి.ఎన్.కె.చైతన్య తెలిపారు. తాడిపత్రిలో ఈనెల 24న తెదేపా, వైకాపా నాయకుల మధ్య రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులపైన, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడిపైనా పోలీసులు కేసులు నమోదు చేసి 144 సెక్షన్‌ అమలు చేశారు.

జేసీ దివాకర్​రెడ్డిపై కేసు నమోదు

పెద్దారెడ్డి, ఆయన కుమారులపై తాము ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎలా నమోదు చేస్తారంటూ ప్రభాకర్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి సోమవారం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టేందుకు పిలుపునిచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ముందస్తుగా ప్రభాకర్‌రెడ్డిని ఆయన నివాసంలో, పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామంలోని ఫామ్​హౌస్‌లో ఉన్న దివాకర్‌రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఈ సమయంలో తన ఇంట్లోకి వచ్చిన పోలీసులపై మాజీ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేసి వారిపై విరుచుకుపడ్డారు. పోలీసులకు, దివాకర్‌రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ.. అసభ్య పదజాలంతో దూషించారని సిబ్బంది ఫిర్యాదు మేరకు దివాకర్‌రెడ్డిపై 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా డీఎస్పీ చైతన్య తెలిపారు.

ఇదీ చూడండి:అవినీతికి కాదేదీ అనర్హం.. మీసేవల్లోనూ అక్రమం!

ABOUT THE AUTHOR

...view details