ఒడిశాకి చెందిన ప్రఫుల్ కుమార్ అతని స్నేహితులు హేమంత్ కుమార్, సుజిత్ కుమార్‌లు పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో.. తమ సహచరులు గతంలో కార్డు క్లోనింగ్ చేస్తున్న విధానాన్ని గమనించి, వీరు కూడా అదే బాట పట్టారు. ప్రధాన నిందితుడైన ప్రఫుల్ కుమార్ నగరంలోని పలు పబ్బులు, రెస్టారెంట్లలో పనికి చేరి అతని స్నేహితులను కూడా అక్కడ చేర్పించాడు. అయితే ముందుగానే వీరు ఆన్లైన్లో కార్డు స్కిమ్మర్, క్లోనింగ్ మిషన్‌ను కొనుగోలు చేశారు.
పిన్ నంబర్ గుర్తుపెట్టుకుంటారు..
కస్టమర్లు బిల్లు కట్టే సమయంలో కొంత మంది వారి పిన్ నంబర్‌ను వెయిటర్‌కి చెప్తారు. ఇదే అదునుగా చూసి వారి చేతిలో ఉన్న స్కిమ్మర్ సాయంతో డేటాను స్వైప్ చేస్తారు. అనంతరం కస్టమర్ కార్డును పీఓఎస్ మెషీన్లో పెట్టి సాధారణంగా బిల్లును కడతారు. అదే సమయంలో వారు నమోదు చేసే పిన్ నంబర్‌ను గుర్తుపెట్టుకుంటారు.
బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో..
ఇలా పలు కార్డులు వివరాలు స్కిమ్మర్‌లో తస్కరించి వాటిని లాప్టాప్కు అనుసంధానం చేస్తారు. ఈ వివరాలతో క్లోనింగ్ పరికరంలో నకిలీ కార్డులు సృష్టిస్తారు. తాజాగా గచ్చిబౌలికి చెందిన ఓ బ్యాంక్ మేనేజర్ తమ ఖాతాదారుల నుంచి డబ్బు చోరీ జరిగిందంటూ చేసిన ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. ఇలా ఇప్పటి వరకూ 150 మంది కస్టమర్ల డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు సేకరించినట్లు పోలీసులు వివరించారు.