తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మధ్యాహ్నం కన్యాదాత.. అర్ధరాత్రి మృత్యువాత - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు

కన్యాదాతగా మారి చెల్లెలి పెళ్లి వైభవంగా చేశాడు. అప్పగింతల తంతు పూర్తిచేశాడు. తర్వాత బంధువులను దించి వస్తానని చెప్పి కారులో వెళ్లి రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు తరలిపోయాడు. ఆయనతో పాటు మరో ఇద్దరు మరణించారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.

brother-died-in-a-road-accident-after-his-sister-marriage-at-ellareddy-peta-in-siddipeta
మధ్యాహ్నం కన్యాదాత.. అర్ధరాత్రి మృత్యువాత

By

Published : Jan 9, 2021, 12:16 PM IST

చెల్లెలి పెళ్లి చేసిన రోజే అన్న దుర్మరణం చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. బంధువులను దించేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొగుట మండలం ఎల్లారెడ్డిపేటకు చెందిన బైతి పరశురాములు(38) చెల్లెలి వివాహం గురువారం మధ్యాహ్నం జరిగింది. వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నా తనకు ఇద్దరూ కుమారులే కావడంతో సోదరి వివాహంలో కన్యాదాతగా వ్యవహరించాడు. సిద్దిపేట మండలం మందపల్లిలో ఇద్దరు బంధువులను దించేందుకు సాయంత్రం ఇన్నోవా కారులో మొత్తం ఆరుగురు ప్రయాణించారు.

వారిద్దరినీ దించేసి మిగిలిన నలుగురు తిరిగి వస్తుండగా.. గురువారం అర్ధరాత్రి తడకపల్లి పాఠశాల వద్ద ఒక చెట్టును వేగంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో పరశురాములు అక్కడికక్కడే మరణించాడు. ఇతని చిన్నాన్న కొడుకు బైతి నాగేశ్‌(22), తమ్ముడి బావమరిది చేర్యాల మండలం కమలాయపల్లికి చెందిన రాగుల అజయ్‌(30) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. మరో బంధువు ఐలయ్యకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వాహనం వేగంగా నడపటమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్సై శంకర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబాలకు దూరమైన అండ:

చనిపోయిన వారిలో పరశురాములు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య కనకవ్వ, పదమూడేళ్లు, ఏడాది వయసున్న ఇద్దరు కుమారులున్నారు. మృతుల్లో మరో యువకుడు నాగేశ్‌ తల్లిదండ్రులు రాములు, రేణుక వ్యవసాయ కూలీలు. డ్రైవర్‌గా పనిచేస్తూ తమ్ముడితో సహా కుటుంబానికి అందివచ్చి ఆసరాగా నిలుస్తున్నాడు. అజయ్‌ హైదరాబాద్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా చేస్తూ అక్కడే ఉండేవాడు. తల్లిదండ్రులు తిరుపతి, భూలక్ష్మి గ్రామంలో పొలం సాగు చేస్తున్నారు. ఇన్నాళ్లూ హైదరాబాద్‌లోనే ఉన్నాడని.. ఇప్పుడు తమకు దూరమయ్యాడని వారు రోదిస్తున్నారు.

ఇదీ చూడండి: తండ్రి మరణాన్ని భరించలేక కూతురు ఆత్మహత్య.!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details