పెళ్లి ఒక రోజు ఉందనగా వధువు అదృశ్యమైన సంఘటన ఇది. ఈ ఘటనపై సుజాతనగర్ పోలీస్ స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. మండల కేంద్రంలోని సిరిపురం ప్రాంతానికి చెందిన యువతి (22) సుజాతనగర్‌లోనే ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఆమె తండ్రి చనిపోగా తల్లి కుమార్తెల బాధ్యతలు చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ యువతికి టేకులపల్లి మండలానికి చెందిన యువకుడితో ఇటీవల కులాంతర వివాహం నిశ్ఛయమైంది. శుక్రవారం బంధుమిత్రుల సమక్షంలో వేడుక జరగాల్సి ఉంది.
పెళ్లికి ముందు రోజు.. వధువు అదృశ్యం - ఖమ్మం జిల్లా నేరవార్తలు
తెల్లవారితే పెళ్లి అనగా వధువు అదృశ్యమైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సిరిపురం ప్రాంతంలో చోటుచేసుకుంది. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గురువారం ఉదయం బయటకు వెళ్లిన వధువు సాయంత్రమైనా తిరిగి రాలేదు. ఇరుగుపొరుగున, సమీప బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘గతకొద్ది రోజులుగా సీతంపేటబంజరకు చెందిన ఓ వ్యక్తి ప్రేమ పేరుతో తన కూతుర్ని వేధిస్తున్నాడని, ఆమెకు మాయమాటలు చెప్పి అతనే ఎటో తీసుకెళ్లి ఉంటాడని’ అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఎస్సై శ్రీనివాస్ విచారణ చేపట్టారు. సంఘటనకు కారణమైనట్లు భావిస్తున్న వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతనికి ఇప్పటికే పెళ్లి కూడా అయినట్లు తెలుస్తోంది.