ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి బాలుడి అదృశ్యం కేసు కొత్త మలుపు తిరిగింది. అదృశ్యమైన బాలుడే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసుల విచారణలో తేలింది. సెల్‌ఫోన్ ఎక్కువగా చూస్తున్నాడని తండ్రి తిడుతున్నాడనే ఇంతటి పని చేశాడని పోలీసులు నిర్దరణకు వచ్చారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిన్న బాలుడు అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. వస్త్ర దుకాణం నిర్వహించే వెంకటేశ్వర్లు కుమారుడు వినయ్. తరచూ ఫోన్ చూస్తుండే వాడు. దీన్ని గమనించిన తండ్రి రోజూ మందలించేవాడు. తండ్రి తిట్టడాన్ని సహించలేకపోయిన వినయ్... తండ్రిపై కోపాన్ని పెంచుకున్నాడు.
తండ్రిని బెదిరించాలనే ఆలోచనకు వచ్చిన వినయ్... దుకాణంలో పని చేస్తున్న 17ఏళ్ల ప్రమోద్ రాజ్‌కుమార్‌తో మనసులో మాట చెప్పాడు. డబ్బులకు ఆశ పడిన అతను ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి కిడ్నాప్ డ్రామాకు తెరతీశారు. ఇంట్లో నుంచి వెళ్తూనే తాతయ్య వద్ద ఉండే ఫోన్లో సిమ్ తీసుకెళ్లిపోయాడు వినయ్.
అనుకున్న పథకం ప్రకారం... గుమస్తా ఇంట్లో వినయ్ దాక్కున్నాడు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇద్దరూ జాగ్రత్త పడ్డారు. తాతయ్య దగ్గర నుంచి తీసుకొచ్చిన సిమ్ కార్డు ద్వారా వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి వినయ్‌ను కిడ్నాప్ చేసినట్టు చెప్పాడు. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్నా గ్యాంగ్ పేరుతో ఈ కాల్స్ చేశారు.