రెండు రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కిడ్నాప్‌కు గురైన బాలుడి ఆచూకీ ఇంక లభ్యం కాలేదు. బాబు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. స్థానిక కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న ఓ టీవీ ఛానల్లో వీడియో జర్నలిస్టు రంజిత్.. వసంత దంపతుల పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డిని (9)ని గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం సాయంత్రం ద్విచక్రవాహనంపై వచ్చి కిడ్నాప్ చేశాడు.
ఆ రోజు రాత్రి 9 గంటల 45 నిమిషాల నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు కిడ్నాపర్ తల్లికి 5 సార్లు ఫోన్ చేశారు. 45 లక్షలు ఇస్తేనే బాబును విడిచిపెడతామని చెప్పారు. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని.. పోలీసులకు కంప్లైంట్ చేయవద్దని చెప్పారు. పోలీసులకు ఆచూకీ లభించకుండా ఇంటర్నెట్ కాల్ చేసి వెంటనే ఫోన్ పెట్టేశాడు కిడ్నాపర్.
బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి స్వయంగా బాలుడు కిడ్నాపైన ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. 100 మంది సిబ్బందితో 10 బృందాలు ఏర్పాటు చేసి విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. 120 ప్రభుత్వ, 80 ప్రైవేట్ సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు.. పలువురు అనుమానితులు.... తల్లిదండ్రులను విచారించారు. ఓ కిరాణా దుకాణంలో లభించిన సీసీ టీవీ ఫుటేజీతో నిందితుడిని పట్టకునేందకు ప్రయత్నిస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసులను కోరారు. చివరిసారిగా ఫోన్ చేసిన కిడ్నాపర్ ఇటీవలే 45 లక్షల రూపాయలతో ప్లాట్ కొనుగోలు చేశావ్ కదా దాన్ని అమ్మి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మళ్లీ 2 గంటలకు ఫోన్ చేస్తా అని పెట్టే శాడు. ఈ సంభాషణ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ముందే జరిగింది. దీంతో కిడ్నాపర్ తెలిసిన వాడేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మళ్లీ ఫోన్ చేయకపోవడంతో కిడ్నాపర్ ఫోన్ కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసిన వ్యక్తి 15 రోజుల క్రితం ఇంటి వద్దకు వచ్చి చాక్లెట్ కొనుక్కోమని అతనికి పది రూపాయలు ఇచ్చాడని తెలిసింది.
ఇదీ చదవండి:కొవిడ్-19పై పోరులో భారత్ కృషి కీలకం: బిల్ గేట్స్