ఒడిశా, ఛత్తీస్‌గఢ్, విశాఖ నుంచి గంజాయి అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. 3 రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేసి... హైదరాబాద్, వరంగల్, కర్ణాటక, మహారాష్ట్రలకు తరలిస్తున్నారు. భద్రాచలం ఏజెన్సీకి... సరిహద్దులు దగ్గరగా ఉండటం, నిఘా ఎక్కువ లేకపోవడం వల్ల అక్రమార్కులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తనిఖీలు ఎక్కువగా ఉన్న భద్రాచలం దాటితే దర్జాగా లక్ష్యానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు. సీలేరు మీదుగా భద్రాచలం వైపు సాగుతున్న అక్రమ రవాణా పట్టుబడకపోవడం అక్రమార్కులకు కాసుల పంటగా మారింది.
కూరగాయల వ్యానులో..
ఈనెల 11న రూ. 2.12 కోట్ల విలువగల 1,415 కిలోల గంజాయిని కూరగాయల వ్యానులో తరలిస్తుండగా భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. మరో 3 రోజులకే ఛత్తీస్‌గఢ్ సరిహద్దు నుంచి వస్తున్న వాహనాన్ని భద్రాచలం చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేయగా రూ. 34 లక్షల విలువైన 226 కిలోల గంజాయి పట్టుబడింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మొత్తం 20 కేసులు నమోదుకావడం, 32 మందిని అరెస్టు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇలా కేవలం 20 కేసుల్లోనే దాదాపు 5 కోట్లకు పైగా విలువ చేసే గంజాయి పోలీసులకు చిక్కింది. నిత్యం గంజాయి స్వాధీనం చేసుసుంటున్నా... రవాణా మాత్రం ఆగడం లేదు.