తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆదివాసీల హక్కులకు భంగం వాటిల్లుతోందని ఆదివాసీ ఐక్య సంఘాల నేతలు మన్యం బంద్‌కు పిలుపునివ్వడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివాసీ నేతలు బంద్‌ను చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కొద్దిసేపు ధర్నా నిర్వహించి.. బస్సులను నిలిపివేశారు. అనంతరం పట్టణంలో తిరుగుతూ అన్ని దుకాణాలు బంద్ చేయించారు. ప్రైవేటు వాహనాలు నడపరాదంటూ నినాదాలు చేశారు.
అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించేందుకు యత్నించిన ఆదివాసీ సంఘాలు, వామపక్ష నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు అనుమతించడం వల్ల అంబేడ్కర్ సెంటర్ నుంచి యూబీ రోడ్డు పాత మార్కెట్ ఏరియా బ్రిడ్జి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
చాలా కాలంగా ఆదివాసీల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని.. ఆదివాసీలకు అనుకూలంగా ఉన్న జీవో నెంబర్ 3కు చట్టబద్ధత తేవాలని, ఆదివాసీల హక్కులు కాపాడాలనే తదితర డిమాండ్లతో బందు చేపట్టినట్లు ఆదివాసీ సంఘాలు తెలిపాయి.