తెలంగాణ

telangana

ఆత్మహత్యకు ముందు కేటీఆర్​కు ట్వీట్.. సోనూసూద్​కు మెయిల్​​..!

ఆ అమ్మాయి ఉన్నత చదువులు చదివి కలెక్టర్ అవ్వాలని కలలు కంది. తమ బిడ్డను గొప్పగా చూడాలని తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకున్నారు. అయినకాడల్లా అప్పులు చేసి కుమార్తెను దిల్లీకి పంపారు. ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనం... తల్లిదండ్రులు పంపే డబ్బుతో హాయిగా చదువుకోవచ్చనుకున్న ఆ చదువుల తల్లి లక్ష్యానికి... కరోనా అడ్డుపడింది. అందని ఉపకార వేతనం... అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబ పరిస్థితి... ఆ అమ్మాయిని ఉరితాడుకు వేలాడేలా చేశాయి.

By

Published : Nov 12, 2020, 9:20 AM IST

Published : Nov 12, 2020, 9:20 AM IST

Updated : Nov 12, 2020, 9:35 AM IST

asihwarya case
ఐశ్వర్య ఆత్మహత్యకు ముందు కేటీఆర్​కు ట్వీట్.. సోనూసూద్​కు మెయిల్​​..!

ఐశ్వర్య ఆత్మహత్యకు ముందు కేటీఆర్​కు ట్వీట్.. సోనూసూద్​కు మెయిల్​​..!

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని శ్రీనివాస కాలనీలో నివసిస్తున్న శ్రీనివాసరెడ్డి, సుమతి దంపతుల పెద్ద కుమార్తె గంటా ఐశ్వర్యారెడ్డి. తండ్రి ద్విచక్రవాహన మోకానిక్. తల్లి దుస్తులు కుడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి పెద్ద కుమార్తె ఐశ్వర్యకు... 10వ తరగతి, ఇంటర్‌లో జిల్లా, రాష్ట్రస్థాయిలో మంచి మార్కులు రావడం వల్ల మంచి చదువులు చదివించాలని అనుకున్నారు. ఈ క్రమంలో అక్క చదువుకు అడ్డుగా మారకూడదని చెల్లి చదువు మానేసింది. తన చదువు కోసం కుటుంబం అప్పులు చేయడం, తండ్రి అనారోగ్యం, ఉపకార వేతనం అందకపోవడం ఐశ్వర్యను మనోవేదనకు గురిచేశాయి. తన చదువు ఇక సాగదని, తల్లిదండ్రులకు భారం కాకూడదంటూ లేఖ రాసి ఈ నెల 2న ఆత్మహత్యకు పాల్పడింది.

ఆర్థిక స్థితిపై ఆందోళన..

ఐశ్వర్యను ఉన్నత చదువులు చదివించాలనుకున్న తల్లిదండ్రులు... దిల్లీలో చదివిస్తే డిగ్రీతోపాటు సివిల్స్‌కు సన్నద్ధం కావచ్చన్న ఉపాధ్యాయుల సూచనలతో అక్కడి లేడీ శ్రీరామ్ కళాశాలలో చేర్పించారు. దిల్లీ విశ్వవిద్యాలయం వసతిగృహంలో ఉంటూ ఐశ్వర్య చదువుకుంటోంది. ఇంటర్‌లో చక్కటి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ఏడాదికి 60 వేల రూపాయలతో ఇన్ స్పైర్ స్కాలర్ షిప్‌ను మంజూరు చేస్తుంది. తనకు ఆ అర్హత ఉండటంతో డిగ్రీలో చేరే ముందే ఆ స్కాలర్ షిప్‌కు దరఖాస్తు చేసుకుంది. కానీ మొదటి సంవత్సరం పూర్తైనా ఆ ఉపకార వేతనం అందలేదు. ఈలోగా లాక్‌డౌన్ ప్రకటించడంతో దిల్లీ యూనివర్సిటీ వసతిగృహానికి సెలవులు ప్రకటించగా... ఇంటికి వచ్చిన ఐశ్వర్యకు కొద్ది రోజుల్లోనే వసతిగృహం ఖాళీ చేసి వెళ్లిపోవాలన్న సందేశం వచ్చింది. అది చూసి ఆందోళన చెందిన ఐశ్వర్యకు తల్లిదండ్రులు ధైర్యం చెప్పారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందిన ఐశ్వర్య.. బలవన్మరణానికి పాల్పడింది..

సోనూసూద్​కు మెయిల్​.. కేటీఆర్​కు ట్వీట్​

ఐశ్వర్య ఆత్మహత్యకు ముందు ప్రముఖ సినీనటుడు సోనూసూద్ కు ఓ ఈ-మెయిల్ పంపించింది. తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఒక ల్యాప్ ట్యాప్ ఇవ్వాలని ఆ మెయిల్లో కోరింది. మంత్రి కేటీఆర్‌కు సైతం ట్విట్ చేసి తన బాధను వివరించింది. అయినా స్పందన లేకపోవడం ... భవిష్యత్‌లో తన చదువు సాగదని, తల్లిదండ్రులకు భారం కాకూడదంటూ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

కలెక్టర్ అవుతానన్న కూతురు... కళ్లెదుటే ఊపిరివదలడం చూసిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. పేదరికం తమ కంటిపాప ప్రాణం తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీచూడండి:విద్యార్థిని ఆత్మహత్య... ఆర్థిక పరిస్థితులే కారణం

ఐశ్వర్యది వ్యవస్థ చేసిన హత్య : విద్యార్థి సంఘాలు

Last Updated : Nov 12, 2020, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details