విశాఖ ఓల్డ్ డైరీ ఫామ్ సుందర్ నగర్‌లోని ఎస్బీఐ ఏటీఎంను ఈ నెల 23న ఇద్దరు దొంగలు లూటీ చేశారు. గ్యాస్ కట్టర్‌తో చాకచక్యంగా ఏటీఎం కట్ చేసి రూ.9 లక్షల 59 వేల నగదును అపహరించారు. చోరీ అనంతరం విమానంలో బెంగళూరు చెక్కేశారు. ఏటీఎం దొంగతనంపై ఈ నెల 23 మధ్యాహ్నం కేసు నమోదు చేసిన పోలీసులు 36 గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు.
పంజాబ్‌కు చెందిన సమర్ జోత్ సింగ్, కేరళ చెందిన జాఫర్ సాదిక్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు విశాఖ క్రైమ్ డీసీపీ సురేశ్ బాబు వెల్లడించారు. నిందితుల నుంచి లక్ష 32 వేల ఐదు వందల రూపాయల నగదు, కాలిపోయిన తొమ్మిది 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రెండు ఖరీదైన సెల్ఫోన్లతో పాటు ఇతర వస్తువులను స్వాధీన పరుచుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 3 లక్షలు వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. సమర్ జోత్ సింగ్ సోదరుడు హర్మిత్ సింగ్ కు రూ.3 లక్షలు పంపినట్లు ఉన్న రసీదు నిందితుల వద్ద లభించినట్లు వెల్లడించారు.
విమానంలో వచ్చి దొంగతనం
నిందితులు పక్కా ప్రణాళికతో దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ నెల 16న హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో చేరుకున్నారు. తర్వాత చోరీ చేయడానికి అనుకూలంగా ఉన్న ఏటీఎంను గుర్తించేందుకు విశాలాక్షి నగర్, మిథిలాపురి కాలనీ, మురళీ నగర్, సుందర్ నగర్, ఆదర్శ్ నగర్లలో తిరిగారు. చివరికి సుందర్ నగర్ ఎస్బీఐ ఏటీఎంను ఎంచుకున్నారు. నేరం చేయడానికి అవసరమైన గ్యాస్ సిలిండర్, గ్యాస్ కటర్ వంటి వాటిని సైతం దొంగతనం చేసే సమకూర్చుకున్నారు. వాటిని ఏటీఎం ఎదురుగా ఉన్న పార్కులో ఉంచారు. ఈ నెల 22 రాత్రికి అక్కడికి చేరుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత గ్యాస్ కటర్‌తో ఏటీఎంను కట్ చేసిన నగదు దొంగిలించారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా వైర్లను కట్ చేశారు. దొంగతనం చేసిన అనంతరం విమానంలో బెంగళూరుకు వెళ్లిపోయారు.
రూ. 3 లక్షలు కాలిపోయాయి!
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువుల విలువ సుమారు రూ. 6,50,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. మరో 3 లక్షల రూపాయలకు సంబంధించిన వివరాలను పోలీసులు రాబట్టే పనిలో ఉన్నారు. నిందితులు విచారణలో ఆ డబ్బు మొత్తం కాలిపోయినట్లు తెలిపారు. ఆ వివరాలు నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. నిందితుల నుంచి కొన్ని కాలిపోయిన నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వేరే ఎవరికైనా ఆ డబ్బును పంపించి ఉండవచ్చని భావిస్తున్నారు. నిందితులపై గతంలోనూ కేసులు ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఈ తరహా నేరాలకు పాల్పడ్డారన్నారు. ఏ1 గా ఉన్న సమర్ జోత్ సింగ్ హత్యానేరం కేసునమోదయిన్నట్లు పోలీసులు గుర్తించారు.
విలాసాలకు అలవాటు పడి
నిందితులు సమర్ జోత్ సింగ్, జాఫర్ సాదిక్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఖరీదైన వస్తువులను వారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వినియోగిస్తున్న బెల్టు ధర ఒక్కటి పది వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. వారి షూస్ విలువ 20 వేల రూపాయల వరకు ఉందన్నారు. రూ. 60 వేలు విలువ చేసే శామ్సంగ్ మొబైల్, రూ.30 వేలు విలువ చేసే అప్పో మొబైల్ పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో ఉన్నాయి. విమానాల్లో తిరగడం, విలాసవంతమైన హోటళ్లలో బస చేయడం నిందితులు అలవాటని పోలీసులు తెలిపారు.
ఆరు బృందాలతో దర్యాప్తు
దొంగతనం చేసిన ప్రదేశంలోనే నిందితులు గ్యాస్ కటర్ ఇతర సామగ్రిని విడిచిపెట్టారు. ఏ ఒక్క ఆధారాన్ని విడిచి పెట్టకుండా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విశాఖ పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా.. ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బెంగళూరు, అనంతపురం పోలీసుల సహకారంతో కేసును సమర్థంగా ఛేదించారు. నిందితుల్ని పట్టుకోవడంలో కీలకంగా నిలిచిన 19 మంది పోలీసులను సీపీ మనీష్ కుమార్ సిన్హా అభినందించారు. ఏసీపీ పెంటారావు నేతృత్వంలో 6 బృందాలు పని చేశాయి.
ఇవీచూడండి:నిద్రిస్తున్న తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి చేసిన కుమారుడు