తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

జాతకంలో దోషమన్నాడు... తాళికట్టి నువ్వే నా భార్య అన్నాడు - Astrologer arrested

Astrologer arrested for lying
Astrologer arrested for lying

By

Published : Sep 23, 2020, 1:32 PM IST

Updated : Sep 23, 2020, 2:41 PM IST

13:21 September 23

జాతకంలో దోషమన్నాడు... తాళికట్టి నువ్వే నా భార్య అన్నాడు

"తాళి కట్టాను... నువ్వే నా భార్య" అంటూ వేధిస్తున్న దొంగ జ్యోతిష్కున్ని హైదరాబాద్​ కేపీహెచ్​బీ పోలీసులు అరెస్టు చేశారు. జాతకంలో దోషమని చెప్పాడు. భర్తతో మళ్లీ తాళి కట్టించుకోవాలన్నాడు. భర్తలేని సమయంలో పూజ చేయాలని చెప్పి... తానే తాళి కట్టేశాడు. ఇక అప్పటి నుంచి తన అసలు రంగు చూపించాడు. 

హైదరాబాద్​ కేపీహెచ్​బీ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళకు ఆమె బంధువు ద్వారా గుంటూరు జిల్లా పండరీపురంకు చెందిన కోసురి మాధవ్​తో పరిచయమయ్యింది. 

తనకు తాను జ్యోతిష్కుడిగా పరిచయం చేసుకున్న మాధవ్... బాధితురాలి ఇంట్లో పూజలు, హోమాల పేరుతో రాకపోకలు సాగించేవాడు. బాధితురాలికి తనపై నమ్మకం ఏర్పడిన తరువాత... మహిళ జాతకంలో దోషం ఉందని తెలిపాడు. దానివల్ల ఆమెకు పక్షవాతం, భర్తకు ప్రాణపాయం ఉందంటూ నమ్మబలికాడు. పూజలు చేయకుంటే భర్తకు ప్రమాదమని చెప్పి భయపెట్టాడు. ఆ దోష పరిహారానికి తన భర్తతో మళ్లీ తాళి కట్టించుకోవాలని సూచించాడు.  

బాధితురాలి భర్త లేని సమయంలో పూజ చేయాలని చెప్పి... ప్రగతినగర్​లోని ఓ గుడికి తీసుకెళ్లాడు. మాయమాటలు చెప్పి ఆమె మెడలో తాళి కట్టాడు. తాళి కట్టాక "నువ్వే నా భార్యవు" అంటూ డబ్బు కోసం బెదిరించటం, చరవాణికి అసభ్యకరమైన ఫోటోలు పంపటం, మానసికంగా, శారీరకంగా వేధించటం మొదలుపెట్టాడు. తన మాట వినకపోతే తాళి కట్టిన విషయం తన భర్తకు చెబుతానని బాధితురాలిని బెదిరించాడు.  

నిందితుని వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసుకు  ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాధవ్​ను, అతనికి సహకరించిన రాఘవ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితులను రిమాండుకు తరలించినట్లు సీఐ లక్ష్మీనారాయణ వెల్లడించారు.  

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి


 

Last Updated : Sep 23, 2020, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details