తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఓ చిన్నారిపై హత్యాచారం కేసులో మరణ శిక్షకు సవరణ - crime news in Chittoor

ఏపీలోని చిత్తూరు జిల్లా కురబలకోట మండల అనగల్లులో ఐదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకేసులో ముద్దాయి మహమ్మద్ రఫీకి విచారణ కోర్టు విధించిన మరణశిక్షను ఏపీ హైకోర్టు సవరించింది. 20ఏళ్ల జీవితకారాగాశిక్ష ఖరారు చేసింది. ముద్దాయి సంస్కరణ పొందే అవకాశం ఉందన్న ధర్మాసనం... ఇతర సెక్షన్ల కింద ఇచ్చిన శిక్షలను సమర్థించింది.

rape case court verdict
చిత్తూరు: చిన్నారిపై హత్యాచారం కేసులో మరణ శిక్షకు సవరణ

By

Published : Jul 17, 2020, 9:53 AM IST

ఆంధ్ర ప్రదేశ్​లో గతేడాది సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా కురబలకోట మండల పరిధిలోని చోటుచేసుకున్న అయిదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకేసులో ముద్దాయికి దిగువ కోర్టు విధించిన మరణశిక్షను... ఆ రాష్ట్ర హైకోర్టు సవరించింది. ఇతర సెక్షన్ల కింద విధించిన శిక్షలను సమర్థించిన ధర్మాసనం.... మరణశిక్షను 20ఏళ్ల కారాగార శిక్షగా ఖరారు చేసింది. నేరఘటన జరిగిన నాటికి నిందితుడి వయసు 25 ఏళ్లని, లారీక్లీనర్‌గా జీవనం సాగిస్తున్నాడని వ్యాఖ్యానించింది. దోషి కనీసం నచ్చిన న్యాయవాదిని పెట్టుకునే స్థితిలో లేడన్న ధర్మాసనం... సంస్కరణ అయ్యేందుకు అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల మరణశిక్షను జీవితకారాగార శిక్షగా మారిస్తే న్యాయం చేసినట్లు అవుతుందని అభిప్రాయపడింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవరిస్తూ... దోషి దాఖలు చేసిన అప్పీలును కొట్టేసింది.

110 రోజుల్లో తీర్పు..

గతేడాది నవంబర్ 7న అనగల్లు పరిధిలోని చేనేతనగర్‌లోని ఓ కల్యాణ మండపంలో వేడుకకు ఓ జంట తమ పిల్లలతో కలిసి వెళ్లారు. అక్కడ ఆడుకుంటున్న చిన్నారిని రఫీ మభ్యపెట్టి అత్యాచారం చేసి హత్య చేశాడని..... పోలీసులు పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన చిత్తూరు మొదటి అదనపు జిల్లా కోర్టు పోక్సో కేసుల్లో రాష్ట్రంలోనే మొదటిసారి నిందితుడికి మరణశిక్ష విధిస్తూ 110 రోజుల్లో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ముద్దాయి.. హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు. మరోవైపు మరణశిక్షను ఖరారు చేసే నిమిత్తం... హైకోర్టుకు విచారణ కోర్టు లేఖ రాసింది. వాటిపై హైకోర్టు సంయుక్తంగా విచారణ జరిపింది.

ఎలా విసిరేస్తారు....

నేర ఘటనను నేరుగా చూసిన సాక్షి ఈ కేసులో లేరని... అప్పీలుదారు తరపు న్యాయవాది వాదించారు. తగిన సమయం ఇవ్వకుండా... విచారణ కోర్టు హడావిడిగా తీర్పు ఇచ్చిందన్నారు. 25 అడుగుల ఎత్తున్న ప్రహరీ గోడ అవతలికి సుమారు 15 కేజీల బరువున్న బాలిక మృతదేహాన్ని నిందితుడు ఎలా విసిరేస్తారన్నారని వాదించారు. నేరంలో అప్పీలుదారిడి పాత్ర సందేహాస్పదం అన్నారు. మరణశిక్ష విధించడానికి గల కారణాలను చూపడంలో విచారణ కోర్టు విఫలమైందన్నారు. నిందితుణ్ని ప్రత్యక్షంగా చూసినట్లు ఇద్దరు సాక్షులు చెప్పారని... పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కర్కశంగా వ్యవహరించిన దోషింపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదన్నారు.

ప్రహరీగోడ మూడు అడుగుల ఎత్తులో మాత్రమే ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. 25 అడుగులు ఉందన్న వాదనలను తిరస్కరిస్తున్నామని పేర్కొంది. నిందితుడి తరపు న్యాయవాదికి దిగువ కోర్టులో వాదనలు వినిపించేందుకు తగిన సమయం ఇవ్వలేదనే వాదనను అంగీకరించలేమని తేల్చిచెప్పింది. పోక్సో చట్టం సెక్షన్-5-జే-4 రెడ్ విత్ సెక్షన్-6 ప్రకారం... విచారణ కోర్టు మరణశిక్ష విధించిందని హైకోర్టు తెలిపింది. చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి కేసుల్లో కనిష్టంగా 20 ఏళ్ల శిక్ష లేదా జీవిత ఖైదుతో పాటు మరణశిక్ష విధించొచ్చని స్పష్టం చేసింది. దోషి వయసు, సామాజిక స్థితి, గతంలో శిక్ష అనుభవించాడా... వదిలిపెడితే సమాజానికి కీడుగా మారతాడా.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని గుర్తుచేసింది. రఫీకి దిగువకోర్టు విధించిన మరణశిక్షను రెమిషన్‌కు తావులేని జీవిత కారాగార శిక్షగా మారుస్తున్నట్లు ధర్మాసనం తీర్పులో పేర్కొంది.

ఇవీ చూడండి:కొందరిలో కొవిడ్‌ ఉన్నా.. పరీక్షల్లో నెగిటివ్‌..

ABOUT THE AUTHOR

...view details