రూ.10వేల పెట్టుబడి పెట్టి.. రూ.లక్షల్లో నగదు కాజేసే ముఠా గుట్టును ఏపీలోని విజయవాడ పోలీసులు రట్టు చేశారు. హరియాణాలోని మేవత్ ప్రాంతానికి చెందిన 13 మంది సభ్యుల ముఠాలో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో విజయవాడలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాల్లో నగదు కాజేస్తున్నారని సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది. దీన్ని వారు సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేర పరిశోధన విభాగం పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఏటీఎం కేంద్రాల్లో నమోదైన సీసీ కెమెరాల చిత్రాలను, ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులను పరిశీలించిన పోలీసులు హరియాణాలోని మేవత్‌ముఠాకు చెందినవారిగా గుర్తించారు.
దీంతో ఓ బృందాన్ని హరియాణాకు పంపిన పోలీసులు.. నగరంలోని ఏటీఎంలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అరెస్టైన వారిలో మేవత్ జిల్లాలోని ముందెత ప్రాంతానికి చెందిన హరీష్‌ఖాన్, అబ్దుల్లాఖాన్, నసీమ్‌అహ్మద్, ఫరూఖ్, నియాజ్ మహమ్మద్, వాహీద్‌ఖాన్‌లు ఉన్నారు. వీరిలో మొదటి నలుగురిని విజయవాడలో అరెస్టు చేయగా.. మిగతా ఇద్దరిని హరియాణాలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని రెండు రోజుల క్రితం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, నగదు రికవరీ చేసేందుకు వారిని సోమవారం పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
రూ.పదివేల పెట్టుబడితో..
కేసు దర్యాప్తులో భాగంగా హరియాణాకు వెళ్లిన పోలీసులకు ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. మేవత్ ప్రాంతంలో దొంగతనం ఓ కుటీర పరిశ్రమలా కొనసాగుతోంది. అత్యాధునిక పద్ధతుల్లో ఏటీఎంల్లో నగదును కొల్లగొట్టడమే వీరి వృత్తిగా ఉంటుంది. తమ స్నేహితులు, బంధువుల పేరుతో వివిధ ప్రైవేటు బ్యాంకుల్లో తెరిచిన ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులను సేకరిస్తారు. ఆ ఖాతాదారులకు కొట్టేసిన మొత్తంలో వాటా ఇస్తారు. ఆ తర్వాత దిల్లీకి వెళ్లి ఎంచుకున్న నగరానికి విమానంలో చేరుకుంటారు. ఈ సమయంలో వారు ఖర్చులకు పోనూ.. రూ.10వేలు మాత్రమే తెచ్చుకుంటారు.
కొద్ది రోజులు నగరంలో తిరుగుతూ.. కాపలాలేని ఎస్‌బీఐ ఏటీఎంలను గుర్తిస్తారు. అనంతరం వారి దగ్గర ఉన్న నగదును తమ వెంట తెచ్చుకున్న ఏటీఎం కార్డులో సంబంధిత బ్యాంకు డిపాజిట్ మిషన్ ద్వారా జమ చేస్తారు. అక్కడి నుంచి ఎస్‌బీఐ ఏటీఎంకి వెళ్లి ఆ నగదును తీసేందుకు ప్రయత్నిస్తారు. నగదు బయటకు వచ్చే సమయంలో రోల్ అయ్యే శబ్దం వచ్చినప్పుడు ఆ యంత్రానికి విద్యుత్తు సరఫరా చేసే ప్లగ్‌ను పీకేస్తారు. అనంతరం ఆ మిషన్‌లోకి చెయ్యి పెట్టి.. నగదును తీసుకుంటారు. ఇలా కాజేసిన మొత్తాన్ని ఎప్పటికప్పుడు తమ ప్రాంతంలోని వారికి పంపించేస్తున్నారు.