కీసర లంచం కేసులో మరో ఐదుగురు అరెస్టు - కీసల పూర్వ తహసీల్దార్ లంచం కేసులో ఐదుగురు అరెస్టు
19:41 September 29
కీసర లంచం కేసులో మరో ఐదుగురు అరెస్టు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు లంచం కేసులో అనిశా అధికారులు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. కీసర మండలం రాంపల్లి దాయరలో ఉన్న భూములకు నాగరాజు... నకిలీ పట్టాలు ఇచ్చాడు. ఈ భూముల విషయమై ఆర్డీవో వద్ద విచారణ పెండింగ్లో ఉండగానే కొంతమందికి అనుకూలంగా నాగరాజు పట్టా పాసుపుస్తకాలు అందించాడు. విజిలెన్స్ నివేదిక మేరకు నాగరాజుపై అనిశా అధికారులు మరో కేసు నమోదు చేశారు. నకిలీ పట్టాల కేసులో కందాడి ధర్మారెడ్డిని రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన అనిశా అధికారులు.... మరో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తహసీల్దార్ కార్యాలయంలో పొరుగుసేవల సిబ్బందిగా పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ వెంకటేశ్, రాంపల్లి దాయరకు చెందిన కందడి శ్రీకాంత్ రెడ్డి, స్థిరాస్తి వ్యాపారులు వెంకట్రావు, జగదీశ్ రావు, భాస్కర్ రావును రిమాండ్కు తరలించారు. ఈ కేసులో నాగరాజు, అంజిరెడ్డి, శ్రీనాథ్, వీఆర్ఏ సాయిరాజును అనిశా అధికారులు గతంలోనే అరెస్ట్ చేశారు. నకిలీ పట్టాలు జారీ చేసిన కేసులో నాగరాజుపై అనిశా అధికారులు మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:కీసర తహసీల్దార్ నాగరాజుకు బెయిల్ నిరాకరణ