మేడ్చల్ జిల్లా కీసర మాజీ తహసీల్దార్ లంచం కేసులో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. నకిలీ పాసు పుస్తకాలు తీసుకున్న కేసులో అరెస్టై ఇటీవలే బయటికి వచ్చిన ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసవినగర్లో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కీసర మాజీ తహసీల్దార్ కేసులో మరొకరు ఆత్మహత్య - మేడ్చల్ జిల్లా తాజా వార్తలు
08:35 November 08
కీసర మాజీ తహసీల్దార్ కేసులో మరొకరు ఆత్మహత్య
కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుతో చేతులు కలిపిన ధర్మారెడ్డి.. జూలై 9న రాంపల్లిలోని పలు సర్వే నంబర్లలో ఉన్న 24 ఎకరాల భూమికి నకిలీ పాసుపుస్తకాలు తీసుకున్నాడు. ఈ కేసులో సెప్టెంబర్ 25న ధర్మారెడ్డిని అనిశా అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో ధర్మారెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డితో పాటు.. తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్, మరో ముగ్గురు స్థిరాస్తి వ్యాపారులను అనిశా అధికారులు సెప్టెంబర్ 29న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఇటీవలే ధర్మారెడ్డి బెయిల్పై విడుదలై చంచల్గూడ జైలు నుంచి బయటికి వచ్చారు. ధర్మారెడ్డి ఇవాళ ఉదయం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు.. గత నెల 14వ తేదీన చంచల్గూడ జైల్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజుపై రూ. కోటి 10 లక్షల లంచం తీసుకున్న కేసుతో పాటు.. నకిలీ పాసుపుస్తకాలు జారీ చేసిన విషయంలో అనిశా అధికారులు కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లోనూ అనిశా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇవీచూడండి:'నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు'