సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల రాజీవ్ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న తిరుపతి సింగయ్య అనే వృద్ధుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన బాధితుడు.. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
కొడకండ్ల గ్రామానికి చెందిన తిరుపతి సింగయ్య గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలం వద్ద పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో రహదారిపై రోడ్డు దాటుతున్న క్రమంలో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సింగయ్యను ఢీకొట్టింది. తీవ్ర గాయాలై.. అపస్మారక స్థితికి చేరుకున్న క్షతగాత్రుడిని స్థానికులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు.