తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ముగిసిన అఖిలప్రియ కస్టడీ... చంచల్‌గూడ జైలుకు తరలింపు - అఖిలప్రియ కేసు

ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో 3 రోజుల విచారణలో అఖిలప్రియ స్టేట్‌మెంట్​ను పోలీసులు రికార్డ్ చేశారు. భూ వివాదానికి సంబంధించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అపహరణకు సంబంధించిన ఏ విషయాన్ని ప్రశ్నించినా... మొదట తనకు తెలియదని దాటవేసిన అఖిలప్రియ... పోలీసులు చూపించిన ఆధారాలతో ఒక్కొక్కటిగా నిజాలు ఒప్పుకున్నట్లు సమాచారం.

akhilapriya
akhilapriya

By

Published : Jan 14, 2021, 3:13 PM IST

Updated : Jan 14, 2021, 4:01 PM IST

ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియ నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించారు. మూడు రోజుల కస్టడీలో భాగంగా అఖిలప్రియను ప్రశ్నించిన పోలీసులు.... భూవివాదానికి సంబంధించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివాదాస్పద భూమిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించినా... ప్రవీణ్ రావు సోదరుల నుంచి స్పందన లేకపోవడంతో అపహరణకు పాల్పడినట్లు పోలీసుల వద్ద అఖిలప్రియ తెలిపినట్లు సమాచారం.

వాళ్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు!

అపహరణకు సంబంధించిన ఏ విషయాన్ని ప్రశ్నించినా... మొదట తనకు తెలియదని దాటవేసిన అఖిలప్రియ... పోలీసులు చూపించిన ఆధారాలతో ఒక్కొక్కటిగా నిజాలు ఒప్పుకున్నట్లు సమాచారం. భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా బోయిన్​పల్లి వెళ్లి అపహరణను ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు. భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనులను అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. వీళ్లకోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

అలా వచ్చింది

హఫీజ్​పేటలో భూమా నాగిరెడ్డికి చెందిన దాదాపు 33 ఎకరాల భూమిని ఆయన బినామీ ఏవీ సుబ్బారెడ్డి పర్యవేక్షించేవారు. 2005లో కృష్ణారావు అనే న్యాయవాదిని న్యాయసలహాదారుగా నియమించుకున్నారు. న్యాయవాది కృష్ణారావు మరణంతో... ఆయన కుమారుడు ప్రవీణ్ రావు, మేనల్లుడు సునీల్ రావు బాధ్యతలు తీసుకున్నారు. ఈ భూమి విషయంలో పలు న్యాయ వివాదాలు ఉండటంతో 2015లో ఏవీ సుబ్బారెడ్డి... ప్రవీణ్ రావు సోదరుల నుంచి నగదు తీసుకొని బయటికి వెళ్లిపోయాడు.

వాటా నిరాకరించడంతో

ఈ విషయం అఖిలప్రియకు తెలవడంతో కొంత కాలంగా ప్రవీణ్ రావుతో పాటు వాళ్ల భాగస్వాములపై ఒత్తిడి తెచ్చారు. భూమా నాగిరెడ్డికి చెందిన భూమిని ఎలా సొంతం చేసుకుంటారని... వాటా ఇవ్వాల్సిందిగా కోరారు. నిరాకరించడంతో అపహరణ చేసి... బలవంతంగా భూమిని రాయించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు దొరికిపోయారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు అఖిలప్రియను... వెస్ట్ మారేడ్‌పల్లిలోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అనంతరం అఖిలప్రియను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అఖిలప్రియ తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్‌ వేశారు. న్యాయస్థానం ఎల్లుండి విచారించనుంది.

సంబంధిత కథనాలు:

కరోనా పరీక్షల్లో అఖిలప్రియకు నెగెటివ్‌గా నిర్ధరణ

కిడ్నాప్​ ప్లాన్​ ఎవరిది.. అప్పుడు అఖిలప్రియ ఎక్కడున్నారు?

Last Updated : Jan 14, 2021, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details