భూమి నిరభ్యంతర పత్రం జారీకి రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేసి దొరికిపోయిన నాటి మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ నుంచి చివరి రోజు కస్టడీలో అనిశా కీలక సమాచారం సేకరించింది. కస్టడీలో తొలిమూడు రోజులు పెద్దగా సహకరించని నగేశ్ నుంచి ఎట్టకేలకు రూ.40 లక్షల లంచం సొమ్ము గురించి సమాచారం రాబట్టింది. బాధితుడి నుంచి రెండు విడతలుగా తీసుకున్న సొమ్ముతో హైదరాబాద్ శివార్లలో ఖాళీస్థలాల్ని కొన్నట్లు అంగీకరించినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన కొన్ని పత్రాల్ని అనిశా గుర్తించింది.
ఈ అక్రమ వ్యవహారంలో నగేశ్.. ఆయన బినామీ జీవన్‌గౌడ్‌ల మధ్య మొబైల్‌లో నడిచిన సంప్రదింపులకు సంబంధించిన సాంకేతిక ఆధారాల్ని అనిశా సంపాదించింది. జీవన్‌గౌడ్ పేరిట భూమి ఒప్పందం రాయిస్తున్నానని.. తర్వాత తన పేరిట మార్పించుకుంటానని నగేశ్ జరిపిన వాట్సప్ సంభాషణల్ని గుర్తించారు. అందుకు బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్‌కార్డు పంపించాలని నగేశ్ అడగడంతో జీవన్‌గౌడ్ వాట్సప్‌లో పంపించినట్లు ఆధారాలు సేకరించారు.