అవినీతి తిమింగళం: ఏసీపీ ఇంట్లో సోదాలు.. రూ.70 కోట్ల ఆస్తులు - ఏసీపీ నరసింహారెడ్డి వార్తలు
19:52 September 23
ఏసీపీ నరసింహారెడ్డికి సంబంధించిన రూ.70 కోట్ల ఆస్తులు గుర్తింపు
ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే అభియోగంపై మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి ఆస్తులపై అవినీతినిరోధక శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రూ.70కోట్ల ఆస్తులను గుర్తించారు. నర్సింహారెడ్డి పలు భూవివాదాల్లో తలదూర్చడం సహా ల్యాండ్ సెటిల్మెంట్లు చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన అనిశా... నిజాలు నిగ్గుతేల్చేందుకు ఏకకాలంలో 25 చోట్ల తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లోని నరసింహారెడ్డి ఇళ్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.
వరంగల్, కరీంనగర్, నల్గొండ, అనంతపురంలో కూడా తనిఖీలు చేస్తున్న అనిశా అధికారులు.. వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు, వాణిజ్య భవనాలున్నాయనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఏపీలోని అనంతపురం జిల్లాలో 55 ఎకరాల వ్యవసాయ భూమి, హైటెక్ సైబర్ టవర్స్ వద్ద 4 ఇంటిస్థలాలు (1,960 గజాలు), మరో 2 ఇంటిస్థలాలు, హఫీజ్‌పేటలో మూడంతస్తుల వ్యాపార సముదాయం, హైదరాబాద్‌లో 2 ఇళ్లు, రూ.15 లక్షలు, 2 లాకర్లను గుర్తించారు. అంతేకాకుండా స్థిరాస్తి, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు.