ఈఎస్ఐ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని గుంటూరు జనరల్ ఆసుపత్రిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు రెండో రోజూ ప్రశ్నించారు. అనిశా కేంద్ర పరిశోధన బృందం (సీఐయూ) డీఎస్పీలు ప్రసాద్, చిరంజీవి నేతృత్వంలో విచారించారు.
ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకూ విచారించిన అధికారులు... అనంతరం భోజన విరామం ఇచ్చారు. దాదాపు 2 గంటల తరువాత మళ్లీ విచారణ ప్రారంభించారు. ఈరోజు మొత్తం ఐదు గంటలపాటు విచారించారు. శనివారం కూడా అచ్చెన్నాయుడిని విచారించనున్నారు.
అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫార్సు లేఖలపైనే ఇవాళ విచారణ జరిగినట్లు సమాచారం. మొదటి రోజు విచారణ రాత్రి వరకూ కొనసాగించటంపై న్యాయవాది అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో శుక్రవారం విచారణ సాయంత్రం ఆరున్నర గంటలకు ముగించారు.
ఔషధాల కొనుగోలు వ్యవహారం అంతా ఈఎస్ఐ డైరక్టర్ల చేతిలో ఉంటుందని... అందులో అచ్చెన్నాయుడిని ఇరికించేందుకు అనిశా అధికారులు యత్నిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది హరిబాబు ఆరోపించారు. లేఖ అనేది కేవలం సలహా మాత్రమేనని... నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాల్సింది అధికారులేనని అన్నారు.
ఇదీ చదవండి:జిల్లాలో ఒక్క రోజే 1.15 లక్షల మొక్కలు నాటాం: కేటీఆర్