షేక్‌పేట్ తహసీల్దార్ సుజాత నివాసంలో భారీగా నగదు పట్టుబడిన కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. బంజారాహిల్స్‌లోని భూ వివాదం కేసులో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నాగార్జునరెడ్డి ఖాలీద్ అనే వ్యక్తి నుంచి రూ.15 లక్షల లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కాడు. విచారణలో భాగంగా అధికారులు సికింద్రాబాద్ గాంధీనగర్‌లోని తహసీల్దార్ సుజాత నివాసంలో సోదాలు నిర్వహించగా రూ. 30 లక్షల రూపాయలు బయటపడ్డాయి. దీంతో పాటు 10 తులాలకు పైగా బంగారం అనిశా అధికారులు గుర్తించారు.
ఆ నగదు ఎక్కడిది?
పెద్ద మొత్తంలో నగదు తహసీల్దార్ సుజాత తన నివాసంలో ఏ విధంగా భద్రపరిచారు. అసలు ఈ నగదు ఎక్కడిది? ఏమైనా అవినీతికి పాల్పడ్డారా? భూ వివాదాల పరిష్కారంలో లంచాలు తీసుకున్నారా? అనే అంశాలపై ఆమెను నాంపల్లిలోని అనిశా కార్యాలయంలో 9 గంటల పాటు విచారించారు. భూ వివాదాల విషయంలో అధికారులు ఏ విధంగా సహకరిస్తారో... సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారిని అనిశా కార్యాలయానికి పిలిపించి పలు వివరాలు తెలుసుకున్నారు. తహసీల్దార్ సుజాతను ఇవాళ మరోసారి అధికారులు విచారించనున్నారు.
రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నాగార్జునరెడ్డిని పది గంటల పాటు విచారించిన అనిశా బృందం... ఆదివారం రాత్రి అతన్ని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టింది. ఈ మేరకు అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ చంచల్‌గూడ జైలుకు తరలిచారు. మరో వైపు ఇదే కేసులో బాధితుడి వద్ద నుంచి లంచం డిమాండ్ చేసిన బంజారాహిల్స్ ఠాణా ఎస్సై రవీందర్‌నాయక్‌ను న్యాయమూర్తి ఎదుట అధికారులు ప్రవేశపెట్టారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. తహసీల్దార్ సుజాతపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇదీ చూడండి:అనిశాకు పట్టుబడిన ఆర్‌ఐ, ఎస్సైకి రిమాండ్