నర్సాపూర్ లంచం కేసులో అనిశా అధికారుల మొదటిరోజు విచారణ ముగిసింది. అదనపు కలెక్టర్ నగేశ్‌తోపాటు... మిగతా నలుగురు నిందితులను అనిశా అధికారులు ప్రశ్నించారు.
ప్రధానంగా 40 లక్షల నగదుతోపాటు... 5ఎకరాల భూమిని బినామీ పేరు మీదు అగ్రిమెంట్ చేయించుకున్న నగేశ్‌ను అధికారులు ఎక్కువ సేపు ప్రశ్నించారు. లంచంగా తీసుకున్న 40 లక్షల నగదును ఎక్కడ దాచారనే ప్రశ్నకు నగేశ్ సమాధానం దాటవేశారు.
అంతేకాకుండా ఆయన ఇంట్లో దొరికిన లాకర్‌కు సంబంధించిన వివరాలు కూడా అధికారులకు తెలపలేదు. బినామీ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అనిశా అధికారులు... వాటి గురించి నగేశ్‌ను ప్రశ్నించగా ముక్తసరిగానే సమాధానమిచ్చారు. బాధితుడు లింగమూర్తి వద్ద అప్పటి మెదక్ కలెక్టర్ పేరును నగేశ్ పదే పదే ప్రస్తావించిన విషయాన్ని అనిశా అధికారులు అడిగినా మౌనంగానే ఉండిపోయారు. ఐదుగురు నిందితులకు కొవిడ్ నిబంధనల ప్రకారం పీపీఈ కిట్లు ఇచ్చారు. ఐదుగురిని వేర్వేరు గదుల్లో దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. మొదటి రోజు విచారణ ముగియడం వల్ల ఆర్టీఓ అరుణా రెడ్డిని చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు. అదనపు కలెక్టర్ నగేశ్‌తోపాటు మిగతా ముగ్గురు నిందితులు అనిశా ప్రధాన కార్యాలయంలోనే ఉన్నారు.
నాలుగు రోజుల కస్టడీ ముగిసే వరకు నలుగురు నిందితులు అనిశా ప్రధాన కార్యాలయంలోనే ఉండనున్నారు. చివరి రోజు విచారణ ముగిసిన తర్వాత అనిశా అధికారులు నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన అనంతరం చంచల్ గూడ జైలుకు రిమాండ్‌కు తరలించనున్నారు.
ఇదీ చూడండి:నర్సాపూర్ లంచం కేసులో ఏసీబీ విచారణ