నర్సాపూర్ లంచం కేసులో ఐదుగురు నిందితులను అవినీతి నిరోధక శాఖ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో అరుణ రెడ్డి, తహసీల్దార్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం, జీవన్‌గౌడ్‌ను బంజారాహిల్స్‌లోని అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్ఓసీ ఇవ్వడానికి అదనపు కలెక్టర్ నగేష్ కోటి 12 లక్షలు తీసుకున్నాడు.
ఇందులో 40 లక్షల రూపాయలు నగదు గాను.. మిగతా 72 లక్షల రూపాయలకు ఐదు ఎకరాల భూమిని తన బినామీ పేరు మీద అగ్రిమెంట్ చేయించుకున్నాడు. బాధితుడు లింగమూర్తి అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించి ఆధారాలు సమర్పించటంతో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. దర్యాప్తులో పురోగతి కోసం ఐదుగురు నిందితులను అనిశా అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.