అనంతపురంలోని అశోక్‌నగర్‌కు చెందిన స్నేహలత.. ధర్మవరం స్టేట్‌బ్యాంకులో పొరుగుసేవల ఉద్యోగినిగా పని చేస్తోంది. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్లి సాయంత్రానికల్లా ఇంటికి వచ్చే ఆమె... మంగళవారం రాత్రి పది గంటలు దాటినా రాలేదు. కంగారుపడిన తల్లిదండ్రులు... వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుమార్తె ఆచూకీ కోసం రాత్రంతా నిద్రపోలేదు. తమ కుమార్తె క్షేమంగా ఉండాలని దేవున్ని ప్రార్థించారు. బుధవారం ఉదయం తెలిసిన వాళ్లందరికీ ఫోన్ చేసి కుమార్తె గురించి ఆరా తీశారు. ఇంతలోనే బడన్నపల్లి వద్ద ఓ యువతి మృతదేహం పాక్షికంగా దహనమైందంటూ పోలీసులకు సమాచారం వచ్చింది. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన పోలీసులు... ఆ మృతదేహం స్నేహలతదేనని నిర్ధరించారు. కుమార్తె మృతదేహాన్ని చూసి.. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అనంతపురానికి చెందిన రాజేశ్... స్నేహితుడు కార్తిక్‌తో కలసి తన కుమార్తెను హత్య చేశాడని తల్లి ఆరోపిస్తున్నారు.
గతంలోనూ రాజేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్నేహలత తల్లి తెలిపారు. చదువుకుంటున్నప్పటి నుంచీ రాజేశ్ వేధించేవాడని వివరించారు. వేధింపులు భరించలేకే స్నేహలత తనకు ఇష్టమైన హాకీ ఆటను వదులుకుందని... కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ఉద్యోగంలో చేరిందని కన్నీటిపర్యంతమయ్యారు.
గొంతు నులిమి హత్య