తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఎమ్మెల్యే తమ భూమి ఆక్రమించారని మహిళ ఆత్మహత్యాయత్నం

తమ భూమిని ఎమ్మెల్యే ఆక్రమించారని ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. తమ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్​ చేయించుకున్నారని తన తల్లి ఆత్మహత్యకు యత్నించిందని బాధితురాలి కుమార్తె తెలిపింది.

ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భూమి ఆక్రమించారని మహిళ ఆత్మహత్యాయత్నం
ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భూమి ఆక్రమించారని మహిళ ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 12, 2020, 8:18 AM IST

Updated : Nov 12, 2020, 9:34 AM IST

ఎంతో విలువైన భూమిని తనకు తెలియకుండా ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలలో బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణం శ్రీనివాసనగర్‌కు చెందిన లక్ష్మీదేవి భర్త కొన్నేళ్ల కిందట మృతి చెందారు. ఆమె భర్త, అతని అన్న(లక్ష్మీదేవి బావ)కు కలిపి స్థానిక పురపాలక కార్యాలయం వెనుక భాగాన 1.29 ఎకరాల భూమి ఉంది. దానిని ఇద్దరూ పంచుకోలేదు. బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆయన కుమారుడు కాటసాని ఓబులరెడ్డి పేరు మీద ఈ నెల 5న 55 సెంట్ల భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఈ విషయం తమకు తెలియదని, తమ సంతకాలు లేకుండా ఎలా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని.. ఆ భూమిని పంచుకోవడానికి కోర్టును ఆశ్రయిస్తుండగా కాటసాని రామిరెడ్డి ఎలా రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటారని లక్ష్మీదేవి ప్రశ్నించారు. తనకు రావాల్సిన భూమిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆస్తి లేకపోతే ఎలా బతకాలని ఇక చావే శరణ్యమని భావించి ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి నిద్ర మాత్రలు వేసుకున్నట్లు చెప్పారు. లక్ష్మీదేవి కుమార్తె భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘మా నాన్న లేరు. నా భర్తతో విడాకుల కేసు నడుస్తోంది. భూమి కోసం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఓబులరెడ్డి, జయమ్మ ఆ కుటుంబ సభ్యులందరూ ఏడాదిగా బెదిరిస్తున్నారు’ అని తెలిపారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తమకు న్యాయం చేయాలని కోరారు. ‘న్యాయం జరగకపోతే అందరం కలిసి ఆత్మహత్య చేసుకుంటాం’ అని ఆమె స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భూమి ఆక్రమించారని మహిళ ఆత్మహత్యాయత్నం

నేను ఎవరినీ బెదిరించలేదు..

తాను ఎవరినీ బెదిరించలేదని బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చెప్పారు. సీఎం దగ్గర చెడ్డ పేరు తేవడానికి కొంతమంది పన్నాగం పన్నారని ఆరోపించారు. నంద్యాలలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మహత్యాయత్నం చేసిన లక్ష్మీదేవికి తాను అన్యాయం చేయలేదన్నారు. 1.29 ఎకరాల్లో తాను 55 సెంట్ల భూమిని లక్ష్మీదేవి బావ వీరారెడ్డి నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఎవరిదైనా ప్రాణమే.. ఆత్మహత్యాయత్నం చేయడం పరిపాటిగా మారిందని వ్యాఖ్యానించారు. తాను తప్పు చేయలేదు కనుక ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఇదీ చదవండి:యథేచ్ఛగా ఇసుక దందా.. అడ్డొచ్చిన వారిపై దాడులు

Last Updated : Nov 12, 2020, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details