వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు గర్భిణీ మృతిచెందింది.
కుల్కచర్లకు చెందిన మక్సూద్ అలీ తన కూతురు జులేకాను హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. గర్భవతి కావడం వల్ల జులేకా కుల్కచర్లలోనే ఉంటోంది. 8 నెలల గర్భిణీగా ఉన్న జులేకా.. ఈరోజు ఉదయం అస్వస్థతకు గురికావడం వల్ల తండ్రి మక్సూద్ పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
మహిళ పరిస్థితి విషమంగా ఉండడం వల్ల ఆస్పత్రి వైద్యులు జులేకాను తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. తాము హైదరాబాద్ తీసుకెళ్తామని మహిళ కుటుంబ సభ్యులు చెప్పినా డాక్టర్లు పట్టించుకోలేదు. చేసేది లేక తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు మహిళ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రిలో చేర్చుకోలేదు. ఫలితంగా జులేకాను హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
తాము హైదరాబాద్ వెళ్తామంటే వెళ్లనివ్వకుండా తాండూరు పంపించడం వల్లే తమ కూతురు చనిపోయిందని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. జులేకా మృతదేహాన్ని తిరిగి పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చి తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.
ఇదీ చూడండి: ఉపాధి పనులు పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి