సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో మల్లన్న సాగర్ ముంపు బాధితుడు.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రావడం లేదంటూ ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. అతని ఒంటిపై నీళ్లు పోసి రక్షించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
అసలేం జరిగింది
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సింగారం గ్రామానికి చెందిన మహమ్మద్ అజీజ్ పాషాకు కొంత వ్యవసాయ భూమి ఉంది. మల్లన్న సాగర్ జలాశయంతో ఆ భూమి ముంపునకు గురైంది. ముంపు పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది.. కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా అందాల్సిన పరిహారం తనకు ఇంకా ఇవ్వలేదని మహమ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ.. కార్యాలయానికి వెళ్లి ఆత్మహత్యకు యత్నించినట్లు వివరించాడు. అధికారులు రేపు మాపు అంటూ పరిహారం ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని వాపోయాడు.