బలవన్మరణం: ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన తల్లి - ఆత్మహత్యలు
10:04 December 27
బలవన్మరణం: ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన తల్లి
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం రాత్రి సమయంలో నాగమణి అనే వివాహిత తన 5 సంవత్సరాల పెద్ద కుమార్తె మార్వెల్ రూబీ, 8 నెలల చిన్న కుమార్తెతో సహా చెన్నపురం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
క్రిస్మస్ పండుగకు పుట్టింటికి వెళ్తానంటే పండుగ అయిపోయిన తర్వాత వెళ్లమని భర్త చెప్పటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇదే విషయమై నిన్న రాత్రి వారి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మనస్తాపానికి గురైన ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోయింది. ఇదే విషయమై భర్త.. జవహర్నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇంతలో చెన్నపురం చెరువులో మృతదేహాలు కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. వారిని నాగమణి, ఆమె ఇద్దరు పిల్లలుగా గుర్తించారు.
ఇదీ చదవండి:మాట్రిమోనీ సైట్లో నకిలీ ఖాతాతో సొమ్ము కాజేసిన కిలేడి