తల్లి ప్రేమను సృష్టిలో దేనితో పోల్చలేమంటారు.. మాతృత్వం కంటే గొప్పది మరొకటి లేదంటారు. 'అమ్మా' అనే పిలుపు కోసం పరితపించని స్త్రీ ఉండదు. అలాంటి అమ్మతనానికి మచ్చతెచ్చేలా చేసింది ఓ మహిళ. పుట్టిన బిడ్డను అపురూపంగా చూసుకోవాల్సిన తల్లే.. ఆ బిడ్డ పాలిట యమపాశమైంది. భర్త మీద కోపంతో 14 రోజుల పసికందును పొట్టనబెట్టుకుంది.
అమానవీయం: పసిబిడ్డను భవనంపై నుంచి పడేసి చంపేసిన తల్లి - 14 రోజుల పసికందును భవనంపై నుంచి పడేసిన తల్లి
15:05 November 14
భర్తపై కోపంతో బిడ్డను భవనంపై నుంచి పడేసిన తల్లి
హైదరాబాద్ సనత్‌నగర్ పరిధిలో మాతృత్వానికే మచ్చ తెచ్చే దారుణం జరిగింది. 14 రోజుల పసికందుని ఓ తల్లి భవనం నుంచి కింద పడేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నేతాజీనగర్ ఈ దారుణం చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్‌కు చెందిన నూతి వేణుగోపాల్‌కు, ఫతేనగర్ నేతాజీనగర్‌కు చెందిన లావణ్యతో 2016 అక్టోబర్‌లో వివాహం జరిగింది. 2017లో వీరికి ఓ బాబు జన్మించాడు. ఆ తర్వాత దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే లావణ్య మరోసారి గర్భం దాల్చింది. ప్రసూతి కోసం పుట్టింటికి వచ్చింది. అయినా భార్యాభర్తల మధ్య గొడవలు ఆగలేదు. తీవ్ర మనస్తాపనికి గురైన లావణ్య గత నెల 29న ఎలుకల నివారణకు వినియోగించే కేకు తిని ఆత్మహత్యకు యత్నించింది.
భర్తపై కోపంతో మూడో అంతస్తు నుంచి..
విషయం తెలుసుకున్న లావణ్య కుటుంబ సభ్యులు సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూనే గత నెల 30న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి పుట్టింటికి వచ్చిన లావణ్య భర్తపై కోపంతో రగిలిపోయింది. శుక్రవారం తానుంటున్న భవనం మూడో అంతస్తు నుంచి పసికందును కిందకు విసరగా.. బాబు అక్కడికక్కడే చనిపోయాడు. లావణ్య భర్త వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:వైద్యం వికటించి మహిళ మృతి.. ఆసుపత్రి ముందు బంధువుల ధర్నా